ఆర్ఎంపీ లు మెడికల్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు.. జిల్లా వైద్యాధికారి సీరియస్
దిశ, కొత్తూరుః ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పరిధి దాటి ఆర్ఎంపిలు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాద్ధికారి డా.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. 13 ఏళ్ల గిరిజన మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటనలో అబార్షన్ చేసిన క్లినిక్ వైద్యుడు రంజిత్ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీ శ్రీనివాస క్లినిక్ ను శుక్రవారం మధ్యాహ్నం సీజ్ చేశారు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్న మైనర్ బాలిక అబార్షన్ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం విధితమే. అయితే గత మూడు రోజులుగా మీడియాలో ఈ ఘటనపై తీవ్ర ధూమారం రేగుతుండటంతో ఎట్టకేలకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి క్లినిక్ ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి,జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ తిరుపతి రావు, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు.. కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హరికిషన్, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, సిహెచ్ఓ నాగేష్, శ్రీకాంత్, నవాజ్ మరియు ఆశలు పాల్గొన్నారు.