శివారులో జోరందుకున్న ఆ దందా
దీపం ఉండగానే ఇళ్లు సర్దుకోవాలనే ఆలోచనతో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ వసూళ్లకు....Special Story
దిశ బ్యూరో, రంగారెడ్డి: దీపం ఉండగానే ఇళ్లు సర్దుకోవాలనే ఆలోచనతో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎన్నికల సమయంలో అయ్యా అప్ప అంటూ ఇల్లు ఇల్లు తిరిగి ప్రజలకు పొర్లు దండాలు పెట్టినవారే ఇప్పుడు వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇళ్లు కట్టుకున్నా...వ్యాపార సముదాయం నిర్మించినా...అంతస్తుకోరేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే చిన్న సాంకేతిక అంశాలను కారణంగా చూపించి స్థానిక సంస్థల నుంచి ఆ భవనాలకు ఆక్యూపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ కాకుండా అడ్డుతగులుతున్నారు. డ్రైనేజీ, వాటర్, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొంత మంది ఏకంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి, బైనంబర్లు వేసి, నోటరీ ద్వారా గుట్టుగా విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అక్రమ వసూళ్ల దందా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సమీపిస్తున్న గడువు.. వసూళ్లలో వేగం..
నిర్మాణాలు ఎక్కువగా వెలుస్తున్న మణికొండ, నార్సింగి, జల్‌పల్లి, బడంగ్‌పేట్, మీర్ పేట్, తుర్కయాంజాల్, పెద్ద అంబర్‌పేట్, శంకర్‌పల్లి, శంషాబాద్ మున్సిపాలిటీల్లో ఈ అక్రమ వసూళ్లు ఎక్కువయ్యాయి. పాలక మండళ్లు ఏర్పడి జనవరితో మూడేళ్లు పూర్తవుతుండడం, అవిశ్వాస తీర్మాణం పెట్టేందుకు అవకాశం ఉంది. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ అక్రమ వసూళ్లలో వేగం పెంచారు. స్థల విస్త్రీర్ణం ఆధారంగా శ్లాబుకోరేటు నిర్ణయిస్తున్నారు. వ్యక్తిగత ఇళ్ల యజమానుల నుంచి రూ.50 వేల వరకు, అదే బిల్డర్లు నిర్మించే భారీ భవన సముదాయాల నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాత్రమే కాదు వారి అనుచరులు కూడా నెలవారి ఖర్చుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కేవలం బిల్డర్ల నుంచే కాదు వీధి వ్యాపారులను కూడా వదలడం లేదు.
ప్రభుత్వ భూములను వదలడం లేదు..
చెరువులు, కుంటలు, శ్మశానవాటికలు, ఇతర ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి, వాటికి పక్కనే ఉన్న పట్టా భూముల సర్వే నెంబర్లు వేసి గుట్టుగా అమ్మకాలు చేపడుతున్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఏకంగా కుర్మల్‌గూడలోని సర్వే నెంబర్ 80/1, 80/2లలోని 13 ఎకరాల ప్రభుత్వ భూమిపైనే కన్నేశాడు. అదేవిధంగా జల్‌పల్లి మున్సిపాలిటీ కొత్తపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 108 నాలుగు ఎకరాలకు పైగా ఉన్న బోడి గుట్ట భూములపై అధికారపార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ సహా మరో స్థానిక నేత కన్నేశారు. అటు పక్కనే ఉన్న బాలాపూర్‌లోని సర్వే నెంబర్ 207కు సంబంధించిన పత్రాలతో ఈ భూములను కబ్జా చేస్తుండటం గమనార్హం. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ కౌన్సిలర్ తన పరిధిలోని భవనం నిర్మించినందుకు తనకు భారీ మొత్తాన్ని ముట్టజెప్పాలని స్థానికంగా ఓ బిల్డర్‌ను బెదిరించాడు. సదరు బిల్డర్ చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో పోలీసులు కౌన్సిలర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల దందా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ ఎన్నికలకు సిద్ధం..
పాలక మండళ్లు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతుండటం, మళ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్నాయి. అందుకోసం పలువురు కార్పొరేటర్లు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ అటు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు వసూళ్లపై దృష్టి పెట్టారు. ఆ అక్రమ సంపాదనతో ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలువాలనే ధీమాతో పని చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read...