పాఠశాల పక్కనే మురుగు కుంట

పాఠశాల పక్కనే మురుగు నీరు నిలిచి కుంటలా తయారైందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కిష్టమ్మగుడి తండా వాసులు ఆవేదన చెందుతున్నారు

Update: 2025-01-07 15:07 GMT

దిశ, పరిగి : పాఠశాల పక్కనే మురుగు నీరు నిలిచి కుంటలా తయారైందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కిష్టమ్మగుడి తండా వాసులు ఆవేదన చెందుతున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 10 వార్డు కిష్టమ్మగుడి తండాలోని మురుగునీరంతా సీసీ రోడ్డుపై ఏరులై పారుతూ పాఠశాల వద్ద మురుగు కుంటలా తయారైందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తండా వాసులు స్వయంగా స్థానిక కౌన్సిలర్, కమిషనర్, చైర్మన్ కు ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మురుగు పక్కనే దుర్వాసన వస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో విద్యాబోధన చేస్తున్నామని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తండా వాసుల స్నానాలు, వంట పాత్రలు కడిగిన నీరంతా మా పాఠశాల పక్కనే చేరి మురుగు కుంటలా తయారై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పాఠశాలలో 60 మందికి పైగా విద్యార్తులు 5వ తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితూనే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు వాపోయారు. స్థానిక పాలకులు స్పందించి వెంటనే పాఠశాల ముందు ఉన్న మురుగు కాలువను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


Similar News