జల్‌పల్లి మున్సిపాలిటీకి 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి మంజూరు
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్‌పల్లి మున్సిపాలిటీలో
దిశ, బడంగ్పేట్ : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్‌పల్లి మున్సిపాలిటీలో రూ. 10 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ( సి హెచ్ సి)ను మంజూరు చేస్తూ వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జల్‌పల్లి మున్సిపాలిటీలో జరిగిన అన్ని కులాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జల్పల్లిలో 30 పడకల ఆసుపత్రి కావాలని కోరిన వెంటనే స్పందించిన మంత్రి హరీష్‌రావు 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు రోజులకే వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్వరం సి హెచ్ సి ని 30 పడకల నుండి 50 పడకలుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో అప్ గ్రేడ్ చేయటం జరిగింది. కందుకూరు లో మెడికల్ కళాశాల కు మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలు ఇటీవలే శంకుస్థాపన చేసిన విషయం విధితమే. జంట కార్పొరేషన్లు,మునిసిపాలిటీలలో పెద్ద ఎత్తున బస్తీ దవాఖానాలు సైతం ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు వైద్య మంత్రి హరీష్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు.