అక్రమ నిర్మాణాలకు అడ్డాగా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్
మూసీ పరివాహ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి ప్రత్యేకంగా
దిశ, శంషాబాద్ : మూసీ పరివాహ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి ప్రత్యేకంగా హైడ్రా కమిటీని వేసి అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా ఓ పక్క రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ లో మాత్రం అక్రమ నిర్మాణదారులు బరితెగించి అక్రమ నిర్మాణాలు చేస్తుండటం గమనార్హం. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవపల్లి డివిజన్లోని ఆరాంఘర్ చౌరస్తా పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా ఓ భారీ ఫంక్షన్ హాల్ ను నిర్మాణం చేస్తున్నాడు అంటే అతనికి జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సామాన్యుడు 100 గజాలలో ఇల్లు కట్టుకుంటే అనుమతులు లేవంటూ హడావిడి చేసే జీహెచ్ఎంసీ అధికారులు ఏకంగా ఆరాంఘర్ నుండి ఎల్బీనగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఇంత ఎత్తున భారీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నారంటే దానిని పట్టనట్టు వ్యవహరించడం స్థానికుల్లో విస్మయానికి గురిచేస్తుంది.
పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అనే విధంగా కండ్లకు కట్టినట్లు యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఎక్కడ నిర్మాణాలు జరిగినా అక్కడికి వచ్చి తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపు కోవడమే పనిగా పెట్టుకున్నారు. స్థానికులు ఎవరైనా ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుందని జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేస్తే అక్రమ నిర్మాణా దారులు బరితెగించి స్థానికులకు బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి అక్రమ నిర్మాణా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆరాంఘర్ చౌరస్తాలో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ కు ఎలాంటి అనుమతులు లేవని గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. నోటీసులు ఇవ్వడమే కాకుండా నిర్మాణం చేసిన కొంత భాగం కూల్చివేయడం కూడా జరిగిందని అయినా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని వారికి మరోసారి నోటీసు ఇచ్చి అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేస్తామని తెలిపారు.