రఘుపతిని ఉరి తీయాలి : గిరిజన విద్యార్థి సంఘం నాయకులు
పదోతరగతి చదువుతున్న అమాయక గిరిజన విద్యార్థి పై అఘాయిత్యానికి పాల్పడిన రఘుపతిని బహిరంగంగా ఉరితీయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు.
దిశ, పరిగి : పదోతరగతి చదువుతున్న అమాయక గిరిజన విద్యార్థి పై అఘాయిత్యానికి పాల్పడిన రఘుపతిని బహిరంగంగా ఉరితీయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లి తండాలో పదవతరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని పై అఘాయిత్యానికి పాల్పడిన సర్పంచ్ తమ్ముడు రఘుపతి సంఘటను నిరసిస్తూ పరిగిలో గిరిజన విద్యార్థి సంఘం ప్రాంతీయ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ రఘుపతిని అరెస్టు చేయడంకాదని వెంటనే ఈ కేసును పాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి ఉరి శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా విద్యార్థిని టూర్ తీసుకువెళ్లి అనంతరం ఇంటి వద్ద వదిలేయకుండా కామాందుడికి అప్పగించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి, క్లాస్ టీచర్ కృష్ణ కుమార్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫోక్సో చట్టం, ఇతర ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదని ఇలాంటి నిందితులను బహిరంగంగా ఉరితీస్తేనే మరొకరు ఇలా చేసేందుకు వెనకడుగు వేస్తారని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ అన్నారు. ఈ సమావేశంలో బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యా నాయక్, పరిగి మండల అధ్యక్షులు అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.