అక్రమ వెంచర్ కూల్చివేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు

నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి.

Update: 2024-07-12 02:22 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో / వికారాబాద్ ప్రతినిధి: నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. అయినా జిల్లా అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయం. జూన్ 10న ‘వెంచర్‌కు రైతు బంధు’ అంటూ ‘దిశ’ దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా పంచాయతీ అధికారి జయసుధ స్పందించారు. నవాబ్ పేట్ మండలం పుల్ మామిడి, వట్టి మినపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో అక్రమంగా నిర్మించిన ‘ఉద్యానవనం’ వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని అక్రమ నిర్మాణాలు, రోడ్లను కూల్చివేయాలని మండల, గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. జూన్ 11న ఉత్తర్వులు నం.756/2023 బీ(పం) ప్రకారం ఆదేశాలు జారీచేశారు.

ఈ ఉత్తర్వు ప్రకారం.. దిశ దినపత్రికలో వచ్చిన ‘ఇడ్లు కట్టుకున్నా రైతు బంధు’ అనే శీర్షిక ఆధారంగా నవాబ్ పేట్ మండలం పుల్ మామిడి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.41,42,43, 44,45లో ఎలాంటి అనుమతులు లేకుండా లేఔట్ చేస్తున్నారని గ్రామ పంచాయతీ పుల్ మామిడి కార్యాలయం నుంచి 17, జూన్ 2022న నోటీస్ నం: జీపీ/ పీఎల్ఎండీ/ ఎన్ 01ను ఇవ్వడానికి వెళ్లారు. యాజమాన్యం ఈ నోటీస్‌ను తిరస్కరిస్తూ భయాందోళనకు గురి చేశారు. అందుకు గాను 23.06.2022న లేఖ సంఖ్య 01/ పీఎల్ఎండీ/2022 ద్వారా మండల పంచాయతీ అధికారి నవాబ్ పేట్ కు తెలియజేశారు. మండల పంచాయతీ అధికారి నవాబ్ పేట్ 23.06.2022న నోటీస్ నం జీపీ/ పీఎల్ఎండీ/ఎన్: 02 ఇచ్చే సమయంలో ఉద్యానవనం లేఔట్ యాజమాన్యానికి తగు సూచనలు చేశారు. వాటిని వారు బేఖాతరు చేస్తూ నోటీస్‌ను తిరస్కరించారు. దాంతో 02.06.2022న ఈ నోటీస్ నం: జీపీ/ పీఎల్ఎండీ/ఎన్:03ను గోడకు అతికించారు.

21.07.2022న లేఖ సంఖ్య :02/పీఎల్ఎండీ/2022 ద్వారా మండల పంచాయతీ అధికారి, నవాబ్ పేట్‌కు ఉద్యానవనం లేఔట్ యాజమాన్యం గ్రామ పంచాయతీ పుల్‌మామిడి నుంచి ఇచ్చిన నోటీసులకు ఎలాంటి లిఖితపూర్వక సమాధానం గానీ, లేఔట్ ధ్రువీకరణ పత్రాలు గానీ గ్రామ పంచాయతీకి సమర్పించలేదు. అక్కడ నిర్మాణాలు ఆపకపోగా, భయభ్రాంతులకు గురిచేశారని లేఖ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఉద్యానవన లేఔట్‌లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నందున తదుపరి చర్యలు తీసుకోవాలని డిపిఓ జయసుధ మండల పంచాయతీ అధికారి, ఫుల్ మామిడి పంచాయతీ కార్యదర్శిలను ఆదేశించారు. అక్రమ లేఔట్ నిర్మాణాన్ని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 సెక్షన్ 114, అవసరమైతే సెక్షన్ 132 ప్రకారం పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను తొలగించి, ఆ నివేదికను వెంటనే జిల్లా పంచాయతీ రాజ్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ జూన్ 11న ఉత్తర్వులు జారీచేస్తే ఇప్పటివరకు మండల స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

మండల అధికారులు అక్రమార్కులకు మద్దతిస్తున్నారా..?

జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీచేసినా అక్రమ లేఔట్‌పై నవాబుపేట ఎంపీడీవో, ఏపీవోతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా వెంచర్ నిర్వాహకులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నత అధికారులు అడిగితే నోటీసులు ఇస్తున్నామని, నోటీసులు ఇవ్వడానికి వెళ్తే బయపెడుతున్నారని కారణాలు చెబుతూ కాలం గడుపుతున్నారని ఆరోపణలున్నాయి. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ గత నెల క్రితం కరెక్టుగా ఇదే 11న ఉత్తర్వులు జారీచేసినా ఇప్పటి వరకు అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరున్నారో అనే చర్చ సాగుతున్నది.

నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలిచ్చాం..

జిల్లా పరిధిలోని నవాబుపేట మండలం పుల్ మామిడి, వట్టి మినపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఉద్యానవనం వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని చెప్పాం. అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలిచ్చాం. నెల గడుస్తున్నా ఇప్పటి వరకు నవాబుపేట మండల పంచాయతీ అధికారుల నుంచి ఎలాంటి నివేదిక రాలేదు. ఈ నిర్లక్ష్యం ఎవరు చేసినా వారిపై చర్యలు తీసుకుంటాం.

- జయసుధ, డీపీవో


Similar News