కుల సర్వేలో అధికారులకు తప్పని తిప్పలు..

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేకు ఆదిలోనే అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి.

Update: 2024-11-13 14:12 GMT

దిశ, గండిపేట్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేకు ఆదిలోనే అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు చేరువ చేయాల‌నే ఉద్దేశ్యంతో ఈ ప‌థ‌కాన్ని చేప‌డుతున్నామ‌ని ప్ర‌భుత్వం పైకి చెబుతున్న‌ప్ప‌టికీ ఇందులో ఏదో మ‌త‌ల‌బు ఉందేమో అన్న అనుమానాన్ని ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు నిరాక‌రిస్తున్నారు. ప్ర‌భుత్వం చేప‌ట్టే స‌ర్వేకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని పైకి బీరాలు పోతున్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో ఆ మేర ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రావ‌డం లేద‌నేది క్షేత్ర‌స్థాయిలో వినిపిస్తున్న మాట‌. వివ‌రాల ప్ర‌కారం తెలంగాణ ప్ర‌భుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప్రారంభించిన నేప‌థ్యంలో గండిపేట్ మండ‌ల ప‌రిధిలోని నార్సింగి, మ‌ణికొండ మున్సిపాలిటీల‌లో ప్ర‌జ‌లు ఈ కార్య‌క్రమానికి స‌హ‌క‌రించేందుకు నిరాక‌రిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఆయా మున్సిపాలిటీల‌లోని పలు కాల‌నీల‌లో అధికారులు వివ‌రాలు సేక‌రించేందుకు వెళ్తే ముఖం మీదే త‌లుపులు వేస్తూ అధికారులు చేప‌డుతున్నా స‌ర్వేకు స‌హ‌క‌రించ‌డం లేద‌ని వినికిడి. ప‌లు చోట్ల చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నప్ప‌టికీ అధికారులు మాత్రం అంతా స‌జావుగా జ‌రుగుతున్న‌ట్లుగా న‌మ్మ‌బ‌లుకుతున్న‌ట్లు స‌మాచారం. 75 ప్ర‌శ్న‌ల‌తో కూడుకున్న స‌మ‌గ్ర స‌ర్వేలో అన్ని ప్ర‌శ్న‌లకు ప్ర‌జ‌ల నుంచి స‌రైన స‌మాధానాలు వ‌స్తున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో అధికారులు స‌ర్వే వివ‌రాల‌ను మేనేజ్ చేస్తున్నారంటూ కొంద‌రు ఆరోపిస్తున్నారు. అయితే ఆధార్‌, ఫోన్ నెంబర్‌, ఆర్థిక‌ప‌రంగా, ఉపాధిప‌రంగా వివ‌రాల‌ను అడుగుతుండ‌టంతో ఎక్క‌డ ప్ర‌భుత్వం త‌మ‌కు వ‌ర్తింప‌జేయాల్సిన సంక్షేమ ప‌థ‌కాల‌లో కోత‌లు విధిస్తారేమోన్న సందేహాన్నిప్ర‌జ‌లు బాహ‌టంగానే వ్య‌క్తం చేస్తున్నారు. చూడాలి మ‌రి నార్సింగి, మ‌ణికొండ మున్సిపాలిటీల‌లో ప్ర‌జ‌లు స‌ర్వేకు ఎంత మేర‌కు స‌హ‌క‌రిస్తారో.

సంక్షేమ ప‌థ‌కాల‌లో కోత విధిస్తారేమో...?

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌ర్వే గండిపేట్ మండ‌ల ప‌రిధిలోని నార్సింగి, మ‌ణికొండ మున్సిపాలిటీలో స‌జావుగా సాగుతుంద‌ని అధికారులు తెలుపుతున్న‌ప్ప‌టికీ క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు విరుద్ధంగా ఉన్నాయ‌ని స‌మాచారం. ప్ర‌ధానంగా ఆధార్‌, ఫోన్ నెంబ‌ర్‌, ఆర్థిక‌, వృత్తి ప‌ర‌మైన అంశాల‌ను అడుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం మ‌దిలో ఏదో బూడుబుటాని ఉందేమోన‌న్న అనుమానాల‌ను ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తుండ‌టం విశేషం. దీంతో ప్ర‌జ‌లు స‌ర్వేకు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించేందుకు నిరాక‌రిస్తున్నార‌ని స‌మాచారం. కొన్ని గేటెడ్‌ క‌మ్యూనిటీలు, విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్ ల‌లో ఉండే వారు అధికారుల ముఖంపైనే డోర్లు వేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. వారు చెప్పిన వివ‌రాల‌ను స‌గం వ‌ర‌కు న‌మోదు చేసుకొని, మిగ‌తావి న‌మోదు చేయ‌కుండానే వెనుతిరుగుతున్నార‌ని తెలుస్తుంది.

కొన్ని చోట్ల ఉన్న‌తాధికారులు వెళితే స‌మాచారం ఇస్తున్నప్ప‌టికీ కొన్నిచోట్ల స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని స‌మాచారం. బిల్ క‌లెక్ట‌ర్లు, చిన్న స్థాయి అధికారుల‌కు ప‌లు చోట్ల చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలోని ప్ర‌ధానంగా అధికారులు ఉన్న‌ప్ప‌టికీ అధికారుల‌కు చేదు అనుభ‌వం ఎదురైంద‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తుంది. ఈ విష‌యంపై అధికారులు ఎక్క‌డ బ‌య‌ట ప‌డ‌క‌పోయిన‌ప్ప‌టికీ మున్సిపాలిటీలో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అధికారులు స‌ర్వే చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు స‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. కానీ చాలా చోట్ల అధికారులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని వినికిడి. ప‌థ‌కాల‌లో కోత విధించేందుకు స‌ర్వే చేస్తున్నార‌నే అనుమానాలు ప్ర‌జ‌ల్లో నానాటికి బ‌ల‌ప‌డితే ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌ర్వే ఉద్దేశ్యం దారిత‌ప్పి స‌ర్వే ల‌క్ష్యాన్ని పూర్తి చేయ‌కుండానే ప‌శ్నార్థ‌క‌మ‌య్యే ప్ర‌మాదం క‌నిపిస్తుంద‌ని నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News