టీఎస్ బీపాస్ అనుమతిలో మాయాజాలం..

నిజామాబాద్ నగరంలో బల్ధియా నుంచి ఇంటి నిర్మాణాలకు జరుగుతున్న అనుమతుల వ్యవహరం మున్సిపాల్ కార్పొరేషన్ కు కోట్లలో నష్టాన్ని తెచ్చిపెడుతుంది.

Update: 2023-03-06 17:14 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో బల్ధియా నుంచి ఇంటి నిర్మాణాలకు జరుగుతున్న అనుమతుల వ్యవహరం మున్సిపాల్ కార్పొరేషన్ కు కోట్లలో నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి యేడాది భూముల ధరలు ఆకాశాన్నంటుతుండగా రియల్ భూంతో వ్యాపారులు లాభపడుతుండగా అక్కడ స్థలాలు కొని ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ప్రభుత్వం తెచ్చిన టీఎస్ బీపాస్ కంటే ముందు నుంచే టౌన్ ప్లానింగ్ లో అనుమతుల వ్యవహరం తిమ్మిని బొమ్మిని చేస్తున్నాయి.

దానితో బల్ధియా నుంచే ఒక్కసారి కమర్షియల్ గా అనుమతి తీసుకుంటే రెండవసారి కూడా కమర్షియల్ గానే పర్మిషన్ ఇవ్వాల్సిన చోట డొమెస్టిక్ గా ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇంటి, వాణిజ్య అవసరాల కోసం నిర్మాణం చేసే నిర్మాణదారుడు ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే అనుమతివ్వాల్సిన చోట లైసెన్స్ డ్ ఇంజనీర్ల పెత్తనం కొనసాగుతుంది. వారికి టౌన్ ప్లానింగ్ అధికారులు వంత పాడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నప్పుడు అనుమతి తీసుకున్న ఒక ఇంటిని నూడాగా డెవలప్ చేసిన తర్వాత టీఎస్ బీపాస్ కింద అనుమతివ్వడం వివాదాస్పదమైంది. దానిపై జరిగిన విచారణ అటకెక్కింది.

నిజామాబాద్ నగరంలోని శ్రద్దానంద్ గంజ్ లో 2011లో భాగ్యలక్ష్మీ అనే మహిళ ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంది. దానిని ఓ లైసెన్స్ డ్ ఇంజనీర్ మార్కెట్ లెక్క ప్రకారం లెక్కలుగట్టి దానికి వాణిజ్య సముదాయంగా జీ ప్లస్ 1 అనుమతిని ఇప్పించారు. అయితే ఇంటి నిర్మాణం కొరకు బ్యాంక్ లోన్ తీసుకుంటే వాణిజ్య అనుమతులతో భవన నిర్మాణం ఉండడంతో రేట్ ఆఫ్ ఇంట్రెస్టు ఇస్తామని వారు మళ్ళీ దానిని రెసిడెన్షీయల్ కింద కన్వర్షన్ కొరకు దరఖాస్తు చేశారు. అయితే నిబంధనల ప్రకారం ఒకసారి వాణిజ్య అవసరాల కోసం అనుమతిచ్చిన భవనానికి రెసిడెన్షీయల్ గా ఇవ్వడం కుదరదు. 2013లో దానిని డొమెస్టిక్ గా మారుస్తూ పర్మిషన్ ఇవ్వడంతో దానిపై వారు ఒక బ్యాంక్ లో రూ.10 లక్షల రుణాన్ని తీసుకున్నారు.

ఈ విషయం తెలిసిన కొందరు సమాచార హక్కు చట్టం కింద 2016లో టీఎస్ బీపాస్ వచ్చిన తర్వాత బల్ధియా నుంచి సమాచారం కోరాడు. కానీ బల్ధియా అధికారులు ఇద్దరు లైసెన్స్ డ్ ఇంజనీర్లకు నోటీసులిచ్చారు. అందులో మొదట వాణిజ్య అవసరాలు భవనానికి అనుమతి తెచ్చిన ఇంజనీర్ అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. కానీ రెండవసారి వాణిజ్య అవసరాల నుంచి డొమెస్టిక్ పర్పస్ అనుమతిని తెచ్చిన లైసెన్స్ డ్ ఇంజనీర్ పత్రాలను సమర్పించడంలో విఫలమయ్యారు. ఇదే విషయాన్ని సదరు దరఖాస్తుదారుడు సమాచార హక్కు చట్టం కింద 2017లో వివరణ కోరగా చావు కబురు చల్లాగా చెప్పినట్లు అదే ఏడాది నవంబర్ 13న సంబంధిత ఫైల్ మిస్సింగ్ అయినట్లు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

మున్సిపల్ ఆదాయంకు గండిపడిన ఈ వ్యవహరంలో సంబంధిత లైసెన్స్ డ్ ఇంజనీర్ లైసెన్స్ ను రద్దు చేయాలి. అంతేగాకుండా ఒకసారి వాణిజ్య అవసరాల కొరకు, రెండవసారి దానినే డొమెస్టిక్ గా పర్మిషన్ ఇవ్వడానికి అనుమతిలో కీలకపాత్ర వహించిన మున్సిపల్, బ్యాంక్ వాల్యూయర్ ను కూడా అందులో బాధ్యులను చేయాల్సి ఉంది. కానీ మాన్యువల్ గా అనుమతులు ఇచ్చిన బల్ధియా అధికారులు టీఎస్ బీపాస్ సమయంలోనూ అదే మాదిరిగా తప్పులు చేస్తున్నారు. నిజామాబాద్ బల్ధియాలో శాశ్వత అధికారులు లేకపోవడంతో టౌన్ ప్లానింగ్ అస్తవ్యవస్థం అయింది. దాంతో వారు ఆడిందే ఆటగా ఇచ్చిందే పర్మిషన్ గా పరిస్థితి మారింది. వారికి లైసెన్స్ డ్ ఇంజనీర్లు తోడు కావడంతో బల్ధియా ఆదాయానికి గండి పడుతుంది.

Tags:    

Similar News