Meerpet: అక్రమ నిర్మాణాలకు అడ్డా మీర్ పేట్.. ఆదాయానికి భారీ గండి

ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా కార్పొరేషన్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.

Update: 2024-12-02 02:37 GMT

దిశ, మీర్ పేట్: ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా కార్పొరేషన్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీ గండిపడుతున్నా పట్టించుకునే నాథుడే లేడా? అని స్థానికులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ చౌరస్తాలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా కమర్షియల్ జీ ప్లస్ వన్‌తో పాటు మూడో ఫ్లోర్ సైతం యథేచ్ఛగా అక్రమంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెలకు ఇచ్చుకొని, మొదటి అంతస్తు కమర్షియల్, మూడో అంతస్తు నిర్మాణాలు పూర్తి చేసుకున్నా అధికారులు మాత్రం తమకేం పట్టదనేలా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదవాడు చిన్న గూడు నిర్మించుకుంటే ఆగమేఘాలమీద వాలిపోయే టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారికి పక్కనే మూడంతస్తుల భవన నిర్మాణం జరుగుతున్నా అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు సంబంధిత అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. పేదవాడికి ఒక న్యాయం ఉన్నోడికి మరో న్యాయమా!? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మీర్ పేట్ కార్పొరేషన్‌లో జరుగుతున్న తతంగం అని విమర్శిస్తున్నారు. అధికారులు అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారా? లేక ముడుపులు తీసుకొని తమకేమీ తెలియదనట్లుగా ఉంటున్నారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సదురు నిర్మాణాలు కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినవి కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నాయకుల ఇండ్లు నిర్మాణాలు జరిగితే పట్టించుకోవద్దు.. అటువైపు కన్నెత్తి చూడొద్దని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరో భవనానికి అదే పరిస్థితి..

రాఘవేంద్ర నగర్ కాలనీలో 120 గజాల స్థలంలో జీ ప్లస్ 2లో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ కార్పొరేటర్ భర్త అండదండతో యథేచ్ఛగా నిర్మాణం జరుపుకొని గృహప్రవేశానికి సైతం సిద్ధం చేసుకున్నారు. ఏంటా అని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆరా తీస్తే.. ఆ భవనానికి ఎలాంటి అనుమతులు లేవు. అయినా కనీసం రుసుము చెల్లించమన్నా చెల్లించకుండా స్థానిక కార్పొరేటర్ భర్త ఒత్తిడితో తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే అధికారులు రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు తలొగ్గి ప్రభుత్వ ఆదాయానికి గండిపడిన మాకెందుకులే అనుకుంటున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారుల ఉదాసీనతను పసిగట్టిన కొంతమంది రాజకీయ నాయకులు ‘మాకు నచ్చినట్లు మేం చేస్తాం.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. మా నిర్మాణాలు మా ఇష్టం‘ అనేలా జరుగుతుండడంతో స్థానిక ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కోట్లాది రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతున్నా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గతంలోనే కొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చర్చనడుస్తున్నది. పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా, షెడ్లు నిర్మిస్తున్నా అందిన కాడికి దండుకొని ప్రభుత్వ ఆదాయానికి గండిపడడానికి సహకరిస్తున్నది ఎవరు? ప్రజా ప్రతినిధులా ? లేక సంబంధిత అధికారులా? అని కార్పొరేషన్ లో బహిరంగానే చర్చించుకుంటున్నారు. ఏదేమైనా అనుమతు లేని నిర్మాణాలపై కొరడా ఝలిపించాలని, చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ ఆదాయానికి గండిపడకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News