కంసన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మంగళవారం
దిశ,నందిగామ: షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి నందిగామ మండల కేంద్రంలోని హిమాలయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (కం సన్) పరిశ్రమలో చోటుచేసుకుంది. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది .దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి, పరిశ్రమలోని మరో షెడ్డుకు మంటలు వ్యాపించకుండా కాపాడారు. రాత్రి కంపెనీలో పనిచేసే ఉద్యోగులు 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. నూతనంగా నిర్మించిన షెడ్డు షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం వల్ల సుమారు రూ. 30 కోట్లు నష్టం వాటిల్లిందని కంపెనీ హెచ్ఆర్ తెలిపారు.