దిశ, గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కంటికి కనిపించేది ఏదైనా సరే వదలట్లేదు. దానిపై ఏదో నిర్మాణం చేపట్టి చేతులు దులుపేసుకోవాల్సిందే. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా అడ్డొస్తే ఏదో ఒకటి చేసేసి తప్పుకోవాలి. అవసరమైతే చేతులు తడపాలి.. లేదంటే బెదిరింపులకు గురి చేయాలి.. ఇంకేం అనుకున్నదేదైనా అయిపోతుంది. మణికొండ మున్సిపాలిటీలో ఇదే తంతు కొనసాగుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ సర్వే నెంబర్ 44 లోని నాలా కబ్జాకు గురవుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. నాలా అని తెలిసినా ఆక్రమణ చేయకుండా వదలలేదు. ఏకంగా నాలా కబ్జాకు గురైనా పట్టించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. నాలాను కబ్జా చేయడమే కాకుండా అందులో ఓ గదిని నిర్మించి చుట్టూ ప్రహారీగోడను నిర్మించారు. అయితే ఈ నిర్మాణం వల్ల నాలా గుండా వెళ్లాల్సిన నీరు కిందకు వెళ్లకుండా అక్కడే నిల్వ ఉంటున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా వర్షం కురిసినా, వరద ముంచుకొచ్చినా ఈ నిర్మాణం కారణంగా చుట్టుపక్కలప్రాంతాలన్నీ నీళ్లతో నిండిపోతాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఈ కబ్జా విషయమై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం - మణికొండ టీపీఓ సంతోష్‌సింగ్
నాలా కబ్జా గురించి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్‌సింగ్‌ను వివరణ కోరగా.. నాలా కబ్జా విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. విచారణ చేపట్టి కబ్జాకు గురైన స్థలంలోని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని వివరించారు.