పుస్తెలతాడు దొంగను పట్టుకున్న పోలీసులు

వ్యవసాయ పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్ళిన దొంగను శుక్రవారం మహేశ్వరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Update: 2022-10-14 12:58 GMT

దిశ, మహేశ్వరం : వ్యవసాయ పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్ళిన దొంగను శుక్రవారం మహేశ్వరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నతూప్ర గ్రామానికి చెందిన తుమ్మలసూరి దుర్గమ్మ(60)తనవ్యవసాయ పొలంలో ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో పనిచేస్తుండగా, శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామానికి చెందిన నరేందర్ (27)తన (ఏపీ 28 సీ కె 5350) నంబర్ గల ప్యాషన్ ప్రో బైక్ చిన్నతూప్ర గ్రామంవైపు వెళ్తూ పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళను గమనించాడు.

పొలంలో ఉన్న మహిళ దగ్గరకు వెళ్లి చిన్నతూప్ర గ్రామం ఎలా వెళ్లాలని అడిగాడు. మహిళ చిరునామా చెప్పి వెనక్కి తిరిగి వస్తుండగా ఆమెమెడలో ఉన్న పుస్తెల తాడును నిందితుడు గమనించాడు. పుస్తెల తాడును దోచుకోవాలని నరేందర్ పథకం పన్నాడు. తన పథకం ప్రకారం నల్లచెరువు తండాకు వెళ్లి తప్పించుకునే మార్గాలకోసం రెక్కీ నిర్వహించి వచ్చాడు. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో వ్యవసాయ పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళ మెడలో ఉన్న సుమారు మూడు తులాల పుస్తెల తాడుతో పాటు, ఒక పుస్తె, రెండు గుండ్లును దొచ్చుకెళ్ళాడు. వెంటనే మహిళ కేకలు వెయ్యడంతో ఇరుగుపొరుగు వారు రావడంతో దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.

పోలీసు ఉన్నతాధికారుల ఆదేశానుసారం పోలీసులు బృందాలుగా ఏర్పడి గురువారం సాయంత్రం చిన్నతూప్ర గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అనుమానితుడిగా బైక్ మీద వెళ్తున్న నరేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా దొంగతనం తానే చేశానని నరేందర్ ఒప్పుకున్నాడు. నిందితుడు నుంచి పోలీసులు పుస్తెల తాడును స్వాధీనం చేసుకుని నిందితుడిని శుక్రవారం పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News