కసిరెడ్డి, సుంకిరెడ్డి ఒక్కటయ్యారు
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణకు మద్దతుగా, పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.
దిశ, ఆమనగల్లు : కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణకు మద్దతుగా, పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో కసిరెడ్డి, సుంకిరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కసిరెడ్డి మాట్లాడుతూ పార్టీ టికెట్ ఆశించిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నట్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పని చేసి జెండా ఎగరవేస్తాం అన్నారు. ఉద్యమ కారులకు అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి మా కుటుంబం కాంగ్రెస్ జెండా మోస్తుందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అందరం కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రము ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు.
చల్లా వంశీచంద్ రెడ్డి గైర్హాజర్..
కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డితో పీసీసీ అధ్యక్షులు పలుమార్లు మాట్లాడి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. దీంతో గురువారం ఉదయము కసిరెడ్డి, సుంకిరెడ్డి సంయుక్త మీడియా సమావేశంలో మాజీఎమ్మెల్యే చల్లా వంశీ చందు రెడ్డి పాల్గొనక పోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ లో చల్లా వంశీ చందు రెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. వంశీ చంచ్ రెడ్డి ఆదేశిస్తేనే ఆయన అనుచర వర్గం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో వంశీ చంద్ రెడ్డి వర్గానికి చెందిన ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు పాల్గొనకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మొదలైందా అనే చర్చ మొదలైంది.