జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరిస్తాం.. ఎమ్మెల్యే కసిరెడ్డి
హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
దిశ, ఆమనగల్లు : హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. గురువారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్న రైతుల పండుగ కార్యక్రమంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని, ఈ బహిరంగ సమావేశానికి కల్వకుర్తి నియోజకవర్గం నుండి సుమారు పదివేల మంది రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రజాపాలన ఓర్వలేక ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. అర్హులైన రైతులకు మాత్రమే రైతు బందు వర్తించేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో 256 సర్వేనెంబర్ లోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు బట్టు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆమనగల్లు మార్కెట్ డైరెక్టర్లు వస్పూల శ్రీశైలం, అజీమ్, నాయకులు కృష్ణ నాయక్, అలీం, మెకానిక్ బాబా, బాబా తదితరులు పాల్గొన్నారు.