ఆ గ్రామాలకు శుభవార్త చెప్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పల్లె ప్రగతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మార్చాయని, నేడు.... Latest News
దిశ ప్రతినిధి వికారాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మార్చాయని, నేడు పట్టణాలు నగరాలకంటే గ్రామాలలోని అన్ని సౌకర్యాలు, మంచి వాతావరణం అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మద్గుల్ చిట్టెంపల్లి డీపీఆర్సీ భవన్ లో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంతోపాటు జాతీయ పంచాయతీ అవార్డులు 2023, జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. జిల్లా నుండి ఉత్తమ గ్రామలుగా ఎంపికైన 27 గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కానీ అవి ఏ నిధులు అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దేశ వ్యాప్తంగా టాప్ 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణ నుండే ఎంపిక అవ్వటం యావత్ తెలంగాణ సర్పంచ్ల విజయం అని మంత్రి పేర్కొన్నారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తాం : జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి
ఈ రబీలో సాగు చేసిన పంటలు వారం కిందటా కురిసిన వడగళ్ల వానతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంత్రులు కూడా వెంటనే పంట పొలాలను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పడం జరిగిందని, జిల్లాలో పంట నష్టపోయిన వివరాలను వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని జడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జొన్న, నూనే గింజల సాగు రానురాను తగ్గిపోతుంది.. వాటి సాగు పెంచేల రైతులకు అధికారులు అవగాహనకల్పించాలి.. తేనే టీగల పెంపకం కూడా లాభదాయకంగా ఉంది.. వాటిపైన రైతులు దృష్టి సారించేల చూడాలి అన్నారు. మరీ ముఖ్యంగా బయట మార్కెట్‌లో కూరగాయాలు పెస్టిసైడ్‌తో పండించినవే దొరుకుతున్నాయి.. రైతులు ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయాలు పండిస్తే పట్టణాల్లో ఆర్గానిక్ కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని జడ్పి చైర్ పర్సన్ సూచించారు. ఈ సందర్బంగా అక్కడికి వచ్చిన ప్రజా ప్రతినిధులకు వైద్యుల సమక్షంలో సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కాలే యాదయ్య, కలెక్టర్ నారాయణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుశీల్ కుమార్ గౌడ్, డీపీఓలు, ఎంపీఓలు, ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్ లు పాల్గొన్నారు.
దోర్నాల బ్రిడ్జి పనులు పూర్తయ్యేది ఎప్పుడు..? : ప్రశ్నించిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ పనుల పట్ల ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఆర్ అండ్ బి అధికారుల తీరు ఉందని, ఒక గంప మట్టివేస్తే సరిపోయే పనిని స్వయంగా ఎమ్మెల్యేలము అయిన తాము చెప్పిన చేయడం లేదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆర్ అండ్ బీ అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ధారూర్ మండలం దోర్నాల బ్రిడ్జ్ పనులు ఇంకా ఎప్పుడు పూర్తవుతాయని అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయగా, ఏజెన్సీ వాళ్ళు బిల్లుల సమస్య ఉందని, మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు.. మేము ఏమి చేయాలని జిల్లా ఆర్ అండ్ బీ అధికారి సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఇదిలా ఉంటే స్వర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగానే జరిగిందనే చెప్పాలి. సర్పంచులకు అవార్డులు ఇచ్చే కార్యక్రమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, 41 అంశాల ఎజెండాలో కేవలం 10, 11 అంశాలనే చర్చించి మిగతావాటికి సమయం ఇవ్వకపోవడంతో జడ్పీటీసీలు, ఎంపీపీలు అసహనం వ్యక్తం చేశారు. ఎంతో ముఖ్యమైన సర్వసభ్య సమావేశం సమయంలో ఈ అవార్డుల కార్యక్రమం ఎందుకని, ఇది తరువాత మరో సమయంలో పెట్టుకుంటే బాగుండేదని పెదవి విరిచారు. ఇక జిల్లాలో ఎంపీపీలు పరిస్థితి వార్డు మెంబర్ కంటే తక్కువగా ఉందని, మండలంలో అభివృద్ధి పనులు ఎక్కడ చేస్తున్నారో..? ఎవరు చేస్తున్నారో కూడా సమాచారం ఇవ్వకుండా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా శాఖల ఇంచార్జి అధికారులు ప్రధానమైన సర్వసభ్య సమావేశాలకు గైహాజరు కావడం సరైన పద్ధతి కాదని, ఇకపై ఇలా జరగకూడదని కలెక్టర్ హెచ్చరించారు.