అక్రమ సెల్లార్‌కు లక్షల్లో వసూలు ? పట్టించుకోని అధికారులు
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
దిశ, బడంగ్పేట్: మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. బడంగ్పేట్ నగరపాలక సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో బడంగ్ పేట్ గ్రంథాలయ శాఖ కార్యాలయం నుంచి నాదర్ గూల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో వందల కొద్ది సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధి అండతోనే యధేచ్చగా నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి.
ప్రధాన రహదారిలో సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నోటీసులు జారీ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు జారీ చేసిన హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తున్నారు. అధికారుల నిఘా లోపం, అవినీతి, పర్యవేక్షణ లేమి కారణంగా అక్రమ సెల్లార్ల నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి. కింది స్థాయి సిబ్బందే ముడుపులు తీసుకుని అక్రమంగా సెల్లార్ల నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు నాకు వర్తించవు అన్నట్టుగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రధాన రహదారిలో 60 నుంచి 200 గజాల స్థలాలలో కూడా నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లలో యధేచ్చగా సెల్లార్ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల కంటి తుడుపు చర్యల వల్ల కొన్ని వందల సంఖ్యలో తక్కువ స్థలంలో నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి.