భోజన నాణ్యత పర్యవేక్షణ లోపంతో ఉపాధ్యాయురాలికి మెమో..

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు.

Update: 2023-02-25 15:58 GMT

దిశ, కుల్కచర్ల : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. శనివారం కుల్కచర్ల మండలం పీరంపల్లిలో ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి జిల్లాకలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లెప్రగతి కింద చేపట్టిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డ్ లను అదేవిధంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను సందర్శించి వంటశాల గదిని, పిల్లలకు వడ్డించే భోజనం నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు.

అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు, బాలింతలకు భోజనం, గుడ్లు, బాలామృతం సరిగ్గా ఇవ్వడం లేదని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా దీనిపై స్పందించిన జిల్లాకలెక్టర్ రిజిస్టర్లను తనిఖీ చేసి అంగన్వాడీ టీచర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని గ్రహించిన కలెక్టర్ అంగన్వాడి టీచర్ వెంకటమ్మను సస్పెండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో భోజనం నాణ్యతలో లోపాన్ని గుర్తించిన కలెక్టర్ పర్యవేక్షణలోపం కారణంగా ఉపాధ్యాయురాలికీ మెమో జారీ చేయనైనది. ఇలాంటిది ఇకమీదట పునరావృత్తం అయితే చర్యలు తప్పవని మండల విద్యాధికారి హబీబ్ ఆమద్ ను కలెక్టర్ హెచ్చరించారు. పల్లె ప్రగతిలో భాగంగా నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనంను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.

వాచర్లు (వన సంరక్షకులు) సక్రమంగా పనిచేయినట్లైతే కొత్తవారిని నియమించుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోకు సూచించారు. డంపింగ్ యార్డులలో తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరే చేసుకోవాలని అదేవిధంగా కంపోస్ షెడ్డులో ఎరువులను తయారు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. వైకుంఠ ధామాలను వాడుకలోకి తీసుకువచ్చి వాటిని పార్కుల మాదిరిగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు. పది రోజుల్లో పల్లెప్రగతి పనులను పూర్తి చేసి వాడకల్లోకి తీసుకురానట్లయితే మండల అధికారులతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

డెలివరీ అయిన తల్లులకు ఫోన్ చేసి మాట్లాడిన కలెక్టర్ శిశువుకు జన్మనివ్వడం పునర్జన్మేనని అలాంటి తల్లికి అంగన్వాడి, ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడి నుంచి అందాల్సిన గుడ్లు, బాలామృతం పై ఆరా తీశారు. ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్త తీసుకొని క్షేమంగా ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు పిల్లలకు చదువుతోపాటు ప్రతి విషయంలోను అవగాహనగా ఉండేలా తీర్చిదిద్దాలని పిల్లలను కోపపడకుండా వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ రాధిక సోమలింగం, ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో ఫీల్డ్ అసిస్టెంట్, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News