గెలాక్సీలో అక్రమ నిర్మాణాలు ?
పేదవాళ్లు తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పునాది తీసే క్రమంలోనే గ్రామపంచాయతీ అధికారులు అనుమతి ఉందా అని ఆరా తీస్తారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో/మహేశ్వరం : పేదవాళ్లు తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పునాది తీసే క్రమంలోనే గ్రామపంచాయతీ అధికారులు అనుమతి ఉందా అని ఆరా తీస్తారు. కానీ ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న వారికి గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపడుతున్న తుమ్మలూరు గ్రామపంచాయతీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
దీనికి నిదర్శనమే తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 352,353,354,355,356,380,381,382,383 లలో గెలాక్సీలో అక్రమార్కులు ప్రహరీ గోడను, ఫ్రీ కాస్ట్, ఫెన్సింగ్ ను నిర్మించడమే. గతంలో గెలాక్సీలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ ప్లాటు చూసుకోకుండా అక్రమార్కులు ప్రహరీ గోడ, ఫ్రీ కాస్ట్ నిర్మిస్తున్నారు. గెలాక్సీ లో గత కొంత కాలం నుంచి అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నా, గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకున్నా పట్టించుకునే వారే లేరు. పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గతంలో పనిచేసిన పంచాయతీ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమార్కులకు కేరాఫ్ తుమ్మలూరు
తుమ్మలూరు గ్రామంలోని 382,383 సర్వే నంబర్ లో డీటిసీపీ, హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రికి రాత్రే వెంచర్లు, ఫామ్ ల్యాండ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 382,383 సర్వే నెంబర్లలో ఏర్పాటు చేసిన వెంచర్ నిర్మాణాలపై పంచాయతీ అధికారులు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. తుమ్మలూరు అక్రమార్కులకు కేరాఫ్ గా మారింది.
కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్లు
గెలాక్సీలో తుమ్మలూరు గ్రామానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, రియల్టర్లు, మహేశ్వరం మండలానికి చెందిన అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు గెలాక్సీ లోని భూమిని తమ పేరు మీద కాకుండా బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. తమ పేరు మీద రిజిస్ట్రేషన్ లో ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి వారి సన్నిహితుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించారు.
నకిలీ డాక్యుమెంట్లు
గెలాక్సీ టెక్ ప్లాంటేషన్ ఖాళీ స్థలంగా ఉండడంతో అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి గుంటలలో ఉన్న భూములను ఎకరాల్లోకి మార్చారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా గెలాక్సీ లో జరిగే అక్రమ నిర్మాణాలపై పంచాయతీ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.