దర్జాగా మొరం దందా.. జోరుగా టిప్పర్ ల రవాణా
మట్టి దందాకు మళ్లీ రెక్కలొచ్చాయి. స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుండటంతో విచ్చలవిడిగా వెంచర్లు వెలుస్తున్నాయి.
దిశ, ఆమనగల్లు : అక్రమ మొరం దందా ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేస్తుండటంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుండడంతో విచ్చలవిడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. వెంచర్లల్లో రహదారుల నిర్మాణానికి స్థిరాస్తి వ్యాపారులకు మట్టి మొరం అవసరం ఉండడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అక్రమ మొరం నిర్వాహకులు అధికారులను మచ్చిక చేసుకుని చెరువులో, కుంటల్లో మట్టిని తరలించి విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి మూర్తుజపల్లి, కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామశివారు నుండి రాత్రి వేళల్లో అక్రమంగా మొరం తరలిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా యదేచ్చగా టిప్పర్ ల సహాయంతో మొరం తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అక్రమ దందాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
దళిత బందు వాహనంలో అక్రమ ఇసుక రవాణా..
దళితులు ఆర్థికంగా బలపడాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కొందరు దుర్వినియోగపరుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దళిత బంధుపథకం ద్వారా వచ్చిన ట్రాక్టర్ లో ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ, ఆకుతోటపల్లిలలో ఇసుక ఫిల్టర్ లు ఏర్పాటు చేసుకొని, అక్రమ ఇసుక తరలిస్తున్నారు.