గౌని చెరువుకు రక్షణ కరువు.. హైడ్రా అయినా చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
గండిపేట్ మండల పరిధిలో చెరువులు కుంటలు నాలాలు కబ్జాకు గురైన పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. భూ బకాసురులు ప్రభుత్వ భూములతో పాటు చెరువులను కబ్జా చేసేస్తున్నారు.
దిశ, గండిపేట్: గండిపేట్ మండల పరిధిలో చెరువులు కుంటలు నాలాలు కబ్జాకు గురైన పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. భూ బకాసురులు ప్రభుత్వ భూములతో పాటు చెరువులను కబ్జా చేసేస్తున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారుల కన్ను సన్నల్లో జురుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.చెరువులను రక్షిల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ రెవెన్యూ శాఖల అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమంగా చెరువులను, కుంటలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కాసుల కక్కుర్తితో అటు వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఫలితంగా రాబోయే కాలంలో చెరువులు నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కబ్జాదారుల అత్యాశతో స్థానికంగా చెరువులు కుచించుకు పోతున్నాయి. అయినా అధికారులు మాత్రం అటువైపు తొంగి చూడటం లేదు. ఇక ప్రజా ప్రతినిధులు అక్రమ నిర్మాణాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. గండిపేట మండల పరిధిలోని నార్సింగి మున్సిపాలిటీ వట్టినాగులపల్లి లోని సర్వే నెంబర్ 91 లోని గౌని చెరువు రోజుకు కుచించుకుపోతుంది. ఈ చెరువు 15 ఎకరాల 22 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా ప్రస్తుతం ఐదు ఎకరాలకే పరిమితం కావడం అధికారుల నిర్లక్ష్యానికి, అక్రమార్కుల అత్యాశకు అద్ధం పడుతుందని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమార్కులు ఇదే విధంగా రెచ్చిపోతే మిగిలిన ఆ ఐదు ఎకరాలు కూడా ఎవరికీ కనిపించకుండా పోతుందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఎర్రకుంట నిండిన తర్వాత గౌని చెరువు నిండుతుంది. ప్రజా ప్రతినిధులు ఈ భూములను కబ్జాలు చేశారు. దీంతో వర్షాలు వస్తే చెరువు నిండి మిగిలిన వరదనీటి కారణంగా పక్కనే ఉన్న కాలనీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చెరువు స్థలాలు కబ్జాలకు గురవుతున్న ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. కబ్జాదారులు ఇచ్చే చిల్లరకు ఆశపడి ప్రజాప్రతినిధులు, అధికారులు సదరు నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కానీ స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది వరదలు ముంచుకు వచ్చినప్పుడు కాలనీలు చెరువులను తలపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అయితే గతంలో పత్రికలలో ఇదే అంశాన్ని లేవనెత్తగా అధికారులు సర్వే చేసి కబ్జా ఎక్కడ జరగలేదని గూగుల్ మ్యాప్స్‌లో చూసి వెళ్ళిపోయేవారు కానీ ప్రస్తుత చెరువు 15 ఎకరాల 22 గుంటల నుంచి కేవలం 5 ఎకరాలకే పరిమితం కావడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. మరి కబ్జాలు కానప్పుడు ఐదు ఎకరాలకే చెరువు ఎలా పరిమితం అవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా బృందం ఈ అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకుంటుందా అంటూ స్థానికులు ఆశిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని గౌని చెరువును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
మామూళ్ల మత్తులో..
స్థానికంగా చెరువులు కబ్జాలకు గురవుతుంటే అధికారులు ప్రజాప్రతినిధులు మామూళ్ల కోసం మౌనంగా ఉంటున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోపణలను నిజం చేసేలా అధికారుల తీరు ఉందని అధికారుల ప్రవర్తన గోచరిస్తుంది. ఇరిగేషన్ రెవెన్యూ విభాగాల అధికారులకు ఈ చెరువుల గురించి అవగాహన ఉందా లేదా అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ని ఏర్పాటు చేసి ఇలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ గౌని చెరువును సైతం అధికారులు కాపాడుతారని స్థానికులు కోరుకుంటున్నారు. ఇక అధికారులు చెరువును రక్షించకపోతే పెద్ద అందోళనలు చేస్తామని స్థానిక యువకులు చెబుతున్నారు.