తట్టి ఖానా రెవెన్యూలో గాల కుంట మాయం
ప్రభుత్వ పరిధిలోని సీలింగ్, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, ఇనామ్ భూములతో పాటు కుంటలు, చెరువులను కాపాడుతామని అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ప్రజలకు ముచ్చట్లు చెబుతున్నది.
దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వ పరిధిలోని సీలింగ్, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, ఇనామ్ భూములతో పాటు కుంటలు, చెరువులను కాపాడుతామని అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ప్రజలకు ముచ్చట్లు చెబుతున్నది. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అధికార పార్టీలోనున్న ప్రజాప్రతినిధులు, అధికారులు నీతులు వల్లిస్తారు. కానీ ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అటు నాయకులు, ఇటు అధికారులు మరిచిపోయి పనిచేస్తున్నారు. ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మొదటగా చెప్పే మాట ప్రభుత్వ స్థిరాస్థులను కాపాడాలని చెప్పడం, అధికారులు వినడం అలవాటుగా మారిపోయింది.
గత ప్రభుత్వంలో చేసిన తప్పులే పునరావృతం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులైన భూములు, చెరువులు, కుంటలను కాపాడాలని తపనపడే వ్యక్తులు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఆ అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదులను ఆసరాగా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విధానం తట్టి ఖానా రెవెన్యూ పరిధిలోని గాలకుంట మాయమైందని స్థానికులు సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఆ ఊరి ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఇరిగేషన్ అధికారి సమాధానం చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పట్టా భూముల్లో ఉంటే పూడ్చేయవచ్చా..!
రంగారెడ్డి జిల్లాలో భవిష్యత్‌లో చూద్దామన్నా గ్రామాల్లో చెరువులు కనిపించని దుస్థితిని రియల్ వ్యాపారులు తీసుకొస్తున్నారు. సంపాదనే లక్ష్యంగా పనిచేసే అధికారులు, అదే ఉద్దేశంతో ఏర్పాటు చేసే లేవుట్లు, వెంచర్లు, విల్లాల వ్యాపారులు ఎంతకైనా తెగిస్తున్నారు. సహజ సిద్ధమైన చెరువులను కబ్జా చేసే అధికారం పట్టా భూమి యజమానులకు కూడా లేదని రెవెన్యూ చట్టం తెలుపుతుంది. భూమిని నమ్ముకొని జీవనం సాగించే పట్టాదారుడైన రైతు చెరువును పూడ్చేందుకు జంకుతాడు. కానీ తమ అవసరాల కోసం భూమిని విక్రయించిన తర్వాత కొనుగోలు చేసిన వ్యాపారి చెరువులను పూడ్చేందుకు సిద్ధపడుతాడు. అదే పరిస్థితి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టి ఖానా గ్రామ రెవెన్యూ పరిధిలోని 38 సర్వే నంబర్‌లో ఎకరంపైగా విస్తీర్ణంలోనున్న గాల కుంటను పూర్తిగా మాయం చేసి ఓ వ్యాపారి యథేచ్ఛగా విల్లాలను నిర్మిస్తున్నారు.
ఇలా కుంటలను పూడ్చివేసే వ్యాపారులకు నిబంధనలు వర్తించవు. అంతేకాకుండా అధికారులు ఇచ్చే తప్పుడు పత్రాల ఆధారంగా ప్రశ్నించిన వ్యక్తులపై ఆ వ్యాపారులు ఎదురు ప్రశ్నలు వేయడం, మీ వద్ద ఏమి ఆధారులున్నాయని ఎదురుదాడి చేయడం ఆలవాటుగా మారిపోయింది. రైతుల వద్ద బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువకు కుంట, చెరువు, గుట్టలని చెప్పి రియల్ వ్యాపారులు అతి తక్కువకు కొనుగోలు చేస్తారు. రియల్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని తప్పులు చేసినా అధికారులకు, ప్రజాప్రతినిధులకు కనిపించవు. అదే రైతు చెరువును, కుంటలను పూడ్చివేస్తే ఫిర్యాదులు చేయడం, చిత్ర హింసలు పెట్టడం అధికారులకు అలవాటు. తట్టిఖానాలోని గాల కుంట చెరువును కబ్జా చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులే.. ఇప్పుడు అదే కుంటను విల్లాలు నిర్మించే వ్యాపారికి ఎలాంటి చెరువులు, కుంటలు లేవని తప్పుడు పత్రాలను అధికారికంగా ఇవ్వడం సిగ్గు చేటు.
తట్టిఖానా గుట్ట నీళ్లకు దారేది..?
చెరువులు, కుంటలు ఉండడంతో భవిష్యత్‌లో భూములకు ధరలు ఉండవనే ఉద్దేశంతో రైతులు విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయాలను ఆసరాగా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేయడం ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల మద్దతుతో చెరువులను, కుంటలను పూడ్చి వేస్తున్నారు. కానీ ఎంతో కాలంగా గ్రామానికి ఆధారమైన కుంటలు, చెరువులను నాశనం చేయడంతో భారీ వర్షాలు సంభవించినప్పుడు ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ సమయంలో ప్రమాదాలను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. అయినప్పటికీ అలాంటి ఆలోచనలు పట్టించుకోకుండా అందినకాడికి దోచుకోవడం.. అడ్డగోలుగా ఎన్వోసీ పత్రాలు ఇవ్వడం అధికారులకే చెల్లుబాటువుతున్నది.
తట్టి ఖానా గ్రామ పరిధిలోని గాల కుంట ఆ ప్రజలకు ఒకప్పుడు జీవనాధారం. అంతేకాకుండా 38 సర్వే నంబర్‌కు అతిచేరువలోనున్న 25, 24 సర్వే నంబర్లలో ఎత్తయిన కొండలు, గుట్టలు, రాళ్లున్నాయి. ఈ గుట్టపై పడిన నీళ్లు నిలిచే ఏకైక ప్రాంతం గాల కుంట. ఇప్పుడు ఆ గాల కుంటను పూర్తిగా పూడ్చివేసి ఓ వ్యాపారి విల్లాలు నిర్మిస్తున్నారు. దీంతో తట్టి ఖానా గుట్టపై నుంచి వచ్చే వర్షపు నీరు నిలిచేందుకు స్థానం లేదు. అంతేకాకుండా భవిష్యత్‌లో వ్యాపారి నిర్మించే విల్లాలు భారీ వర్షాలకు మునిగిపోక తప్పదనే ప్రచారాన్ని స్థానికులు చేస్తున్నారు.
ధరణిలో దర్శనమివ్వని గ్రామ నక్ష..
ప్రజలకు, రైతులకు భూ వివరాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వాలు గ్రామ రెవెన్యూ నక్షాలను ధరణిలో పొందుపర్చారు. భూ స్వరూపాన్ని తెలుసుకోవాలన్నా, ఏ ప్రదేశంలో ఏ సర్వే నంబర్ కలిగి ఉన్నది. ఏ ప్రదేశంలో చెరువులు, కుంటలున్నాయి. ఏ ప్రదేశంలో గుట్టలు, వాగులు, అటవీ ప్రాంతం ఉందనేందుకు రెవెన్యూ నక్షాలు ప్రధానం. అలాంటి నక్షాలను ధరణి వెబ్ సైట్ లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చారు. అయితే ఆ నక్షాలు ధరణిలో దర్శనమివ్వకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ధరణిలో నక్ష కనిపించకుండా సంబంధిత అధికారులు టెక్నికల్ సమస్యను సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది.