వికారాబాద్ లో మాజీ మంత్రుల అరెస్ట్..
వికారాబాద్ జిల్లా, తాండూరు సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం సిద్దులూర్
దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, తాండూరు సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం సిద్దులూర్, వికారాబాద్ మీదగా తాండూర్ వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లను వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మర్రి చెన్నారెడ్డి విగ్రహం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. హాస్టల్ దగ్గరకు వెళ్లడానికి అనుమతి లేదని నిరాకరించారు. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు మర్రి చెన్నారెడ్డి విగ్రహం దగ్గరే రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము హాస్టల్ దగ్గరకు వెళ్తే మీ బండారం బయటపడుతుందని భయపడుతున్నారా..? అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. ఈమధ్య గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగడం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని అన్నారు. జగిత్యాలలో 48 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని తెలిపారు. తాండూర్ హాస్టల్ లో 15 మందికి పైగా పిల్లలు జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి వారి తల్లిదండ్రులు హాస్టల్ దగ్గరకు వస్తే లోపలి పంపలేదని వార్తలు వచ్చాయని, అది చూసే తాము ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. తాండూర్ పట్టణంలో జిల్లా హాస్పిటల్ ఉంది. వికారాబాద్ లో కూడా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.
అయినా అస్వస్థతకు గురైన విద్యార్థులను హాస్పటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయకుండా హాస్టల్లోనే చికిత్స చేయడం ఏంటని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను ప్రశ్నించారు. కలెక్టర్ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… “నేను గతంలో ట్రైబల్ మినిస్టర్ గా పనిచేశాను. వాళ్ళు నా పిల్లలు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులకు కూడా పంపించడం లేదని తెలిసి మేము అక్కడికి వెళ్తున్నాము. పిల్లల విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. అవసరమైతే ప్రభుత్వానికి సలహా ఇస్తాం కానీ రాజకీయాలు చేయము” అన్నారు. అలాగే ఫుడ్ ఫాయిజన్ కు బిఆర్ఎస్ పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణం అంటూ నింద మోపడం సిగ్గుచేటు అన్నారు.
“గత 10 సంవత్సరాలలో మా ప్రభుత్వంలో జరగని సంఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిద్ర మత్తు వదలాలి. కావాలనే గురుకులాలపై తప్పుడు సంకేతాలు వచ్చేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మా అనుమానం. అదే జరిగితే గురుకులాల్లో ఉన్న 5 లక్షల మా పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని” ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా వినక పోవడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు మాజీ మంత్రులను మన్నెగూడ చన్ గోముల్ పోలీస్ స్టేషన్ కు మరికొందరు బిఆర్ఎస్ నాయకులను పరిగి, నవాబ్ పెట్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. వీరిలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్, బిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, గయాజ్, గోపాల్, గిరీష్ కొఠారి, రాజు గుప్తా తదితరులు ఉన్నారు.