విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పేందుకే పోటీలు.. మున్సిపల్ వైస్ చైర్మన్..
క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని, ఓటమి చెందిన వారు నిరాశ పడకుండా క్రీడలలోని మెలకువలను తెలుసుకొని మరింత రాణించాలని శంకరపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
దిశ, శంకర్పల్లి : క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని, ఓటమి చెందిన వారు నిరాశ పడకుండా క్రీడలలోని మెలకువలను తెలుసుకొని మరింత రాణించాలని శంకరపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కప్ - 2024 లో భాగంగా మున్సిపల్ స్థాయిలోని పాఠశాలల విద్యార్థులకు రెండు రోజుల పాటు కబడ్డీ వాలీబాల్, కోకో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు శంకర్పల్లి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇంచార్జ్ ఎంపీడీవో గిరిరాజ్, ఇన్చార్జి ఎంఈఓ సయ్యద్ అక్బర్ తో కలిసి బహుమతుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని, అక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని తదనంతరం ఎంపిక చేయబడిన విజేతలకు సీఎం కప్- 24 అందజేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలలో మంచి ప్రతిభ కనబరిచే విధంగా చర్యలు చేపట్టేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా పోటీల ఇన్చార్జ్ అరుంధతి, ఫిజికల్ డైరెక్టర్లు శంకర్, కళ్యాణి, హైమావతి, ఆయా పాఠశాలల క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
మున్సిపల్ స్థాయిలో విజేతలు వీరే..
ముఖ్యమంత్రి కప్ -2024 లో భాగంగా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పలు పాఠశాలల బాలబాలికలకు రెండు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్, కోకో పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతుల పంపిణీ చేశారు. బాలికల విభాగంలో కబడ్డీ ప్రథమ ( కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ), ద్వితీయ బహుమతి ( శంకరపల్లి బాలికల ఉన్నత పాఠశాల ), ఖోఖో బాలికల విభాగం ప్రథమ బహుమతి ( కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ), ద్వితీయ బహుమతి (రావుస్ హై స్కూల్), వాలీబాల్ పోటీలలో ప్రథమ బహుమతి (శంకరపల్లి ఆదర్శ పాఠశాల ), ద్వితీయ బహుమతి ( కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం ), బాలుర విభాగంలో కబడ్డీ ( జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ), వాలీబాల్( జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ), ఖోఖో పోటీలో రావుస్ హై స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచినట్లు తెలిపారు.