సమాజంలో అన్ని కులాలకు సమ ప్రాధాన్యం.. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్
సమాజంలో నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు.
దిశ, ఆమనగల్లు : సమాజంలో నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. శనివారం బీసీ కులాల్లో ఉన్న వీరముష్టి కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆమనగల్లు పట్టణ కేంద్రంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాష్, సురేందర్, బాల లక్ష్మయ్య, కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అలీ ఖాన్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో నివసిస్తున్న వీరముష్టి కుటుంబ సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న అధికారుల దృష్టికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. చులకన భావంతో కులాలను పిలవడం వల్ల కులస్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బీసీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని, కొన్ని పర్యాయపదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనల పై ఇప్పటికే బీసీ కమిషన్ అభ్యంతరాలు కోరిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భాగంగా వారి ఆర్థిక స్థితిగతులు, కుటుంబ జీవన విధానం తెలుసుకునేందుకు పర్యటిస్తున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ ఫలాలు బీసీ కులాల్లోని అందరికీ అందించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. పిల్లలను చక్కగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలని ఉన్నత స్థానాలు అధిరోహించేలా అన్ని రంగాల్లో వారిని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్ ఫలాలు పొందాలని సూచించారు. కులాల పేర్ల మార్పు అంశాన్ని వచ్చే నెలలో పరిష్కరిస్తామని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రంలో వీరముష్టి స్థానంలో వీరభద్రియగా పేర్కొనాలని కమిషన్ దృష్టికి నాయకులు తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగులంతా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ లలిత, మున్సిపల్ కమిషనర్ శంకర్, కాంగ్రెస్ నాయకులు గుర్రం కేశవులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.