అత్యవసర వైద్య సేవలు అంతంతే
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా యాచారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి
దిశ, యాచారం : గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా యాచారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని సిహెచ్‌సీగా మార్చిన అత్యవసర వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. దీంతో రోగులు, క్షతగాత్రులు నగరబాటపడుతూ సకాలంలో సరైన వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రతిరోజు వైద్యులు మొక్కుబడిగా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తు 4 గంటలకే వెళ్తుండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి వైద్య సేవలు కూడా సిహెచ్‌సీలో అందడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు కిందిస్థాయి సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, 24 గంటలు వైద్యులు అందుబాటులో ఎందుకు ఉండడం లేదని ప్రశ్నిస్తే శిథిలమైన ఆసుపత్రి భవనాన్ని సాకుగా చూపిస్తున్నారనె ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాత్రి వేళల్లో అత్యవసర సేవలు అంతంతే
24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో వైద్యులు, స్థానికంగా నివాసం ఉండడం లేదు. దాంతో రాత్రి వేళల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు నర్సు, చికిత్స అందిస్తూ వాచ్ మెన్ గాయాలకు పట్టీలు కడుతుండడంతో సరైన వైద్య సేవలు అందడం లేదనే విమర్శలున్నాయి.
గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పాటించని వైద్యులు
గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన శశాంక, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వసతులపై ఆరా తీశారు. ఎక్కడలేని విధంగా వైద్య పరికరాలు ఉన్నాయని వాటిని వాడుకోవాలని సూచించారు. ఆసుపత్రి భవనం శిథిలమైందని సాకుగా చూపొద్దని సిహెచ్‌సీ ఆసుపత్రిలో రాత్రి వేళల్లో కంపల్సరీ ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
రాత్రి వేళలో వైద్యం కోసం ఇబ్బందులు పడ్డాం : యాదగిరి, యాచారం గ్రామస్తుడు
రాత్రి వేళల్లో అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే డాక్టర్ లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలి : బిజెపి నాయకులు విషం శెట్టి సంతోష్ గుప్తా
ఆసుపత్రిలో ఫోటోలు తీయవద్దనే ఫ్లెక్సీల ఏర్పాటుపై ఉన్న ఉత్సాహం, 24 గంటలు రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తే సంతోషిస్తామని తెలిపారు.