ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి - డీఎస్పీ శేఖర్ గౌడ్
రానున్న అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కృషి చేయాలని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ కోరారు
దిశ, తాండూరు : రానున్న అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కృషి చేయాలని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ కోరారు. కరన్ కోట్ పోలీస్ స్టేషన్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికల నియమావళి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీశేఖర్ గౌడ్ మాట్లాడుతూ..ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతీఒక్కరు ఎన్నికల నియమావళి ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సువిద యాప్ ద్వారా పార్టీ సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వాహనాలను రాజకీయ అవసరాలకు వాడరాదన్నారు. కరపత్రాలు, పోస్టర్ల ముద్రణ చేసే యాజమానులు కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. అభ్యర్థి డిక్లరేషన్, ప్రింట్ చేసిన కరపత్రాలు, పోస్టర్ల కాపీలను ప్రధాన ఎన్నికల అధికారికి వివరాలను సమర్పించాలన్నారు.
పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా పెట్టాలన్నారు. గొడవలు సృష్టించే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోల వైరల్ చేసే విషయాలు, చిన్న విషయాలైన ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.
ఎన్నికల నిబంధనలకు లోబడి పని చేయాలి..
ఎన్నికల నిబంధనలకు లోబడి పనిచేయాలని కిరాణ, స్టేషనరి, ఫ్లెక్సీ ప్రింటింగ్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ వివిధ వ్యాపారులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, అందరూ నియమ నిబంధనలను పాటించాలన్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించి బిల్ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. నగదుపై నియంత్రణ ఉన్నదని, రూ.50 వేలు మించితే తప్పనిసరిగా ఆ డబ్బుకు సంబంధించిన రశీదు ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కూడిన రిజిస్టర్లను నిర్వహించాలని సూచించారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా వినియోగించే వస్తువులకు రేట్‌కార్డు నిర్ణయించాల్సి ఉందన్నారు. ఆయా వస్తువుల రీజినల్ ధరల షీట్ అందజేయాలని కోరారు.ఈ సమావేశంలో జడ్పిటిసి మంజుల,ఎల్మకన్న సొసైటీ చైర్మన్ రవి గౌడ్,రూరల్ సీఐ రాంబాబు,ఎస్సై మధుసూదన్ రెడ్డి,సర్పంచులు రాజప్ప గౌడ్, మధుమోహన్, అంతారం ఎంపిటిసి శాంతి కుమార్, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.