రాజేంద్ర‌న‌గ‌ర్ లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం మ‌ళ్లీ కలవరపెట్టింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ఓ ఇద్ద‌రు స్థానికంగా ఈవెంట్ల‌కు, ఐటీ ఉద్యోగుల‌కు డ్ర‌గ్స్‌ను విక్ర‌యిస్తున్నారు.

Update: 2024-05-30 11:13 GMT

దిశ‌, రాజేంద్రనగర్: డ్ర‌గ్స్ క‌ల‌క‌లం మ‌ళ్లీ కలవరపెట్టింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ఓ ఇద్ద‌రు స్థానికంగా ఈవెంట్ల‌కు, ఐటీ ఉద్యోగుల‌కు డ్ర‌గ్స్‌ను విక్ర‌యిస్తున్నారు. ఈ విష‌యం విశ్వ‌స‌నీయంగా తెలుసుకున్న శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ లోని తన కార్యాలయంలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్ట‌ర్ గండ్ర దేవేంద‌ర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మ‌హారాష్ట్ర‌కు చెందిన తృప్తి ప్ర‌భాక‌ర్ హోకం (21), మ‌ధ్యప్ర‌దేశ్‌కు చెందిన అనుభ‌వ్ స‌క్సేనా (24) హైదరాబాద్ న‌గ‌రంలోని ఐటీ, ఈవెంట్ మేనేజ‌ర్ల‌ను టార్గెట్‌గా చేసుకొని డ్ర‌గ్స్‌ను విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఈక్ర‌మంలో ఈ నెల 29 వ తేదీన బండ్ల‌గూడ స‌న్‌సిటీ మోర్ సూప‌ర్ మార్కెట్ వ‌ద్ద ఆటో దిగి అనుమానాస్ప‌దంగా త‌చ్చాడుతున్నారు. విశ్వ‌సనీయంగా స‌మాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ ఎస్సై రాఘ‌వేంద‌ర్ కానిస్టేబుళ్ల స‌హాయంతో అక్క‌డ‌కు చేరుకొని ఇరువురి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించారు. వారి వ‌ద్ద 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ఉన్న‌ట్లు గుర్తించి ఆ పౌడ‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్ర‌గ్ విలువ మార్కెట్‌లో రూ.20 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. వెంట‌నే డ్ర‌గ్స్‌ను, ఇరువురిని అదుపులోకి తీసుకొని ఇరువురిని విచారించారు. విచార‌ణ‌లో మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన సాబ‌ర్ అనే వ్య‌క్తి ఇరువురికి డ్ర‌గ్స్‌ను సరఫరా చేస్తున్న‌ట్లు గుర్తించారు. ఈ మేర‌కు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Similar News