పరిమితికి మించి ప్రయాణం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
వివిధ పనుల నిమిత్తం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది.
దిశ, యాచారం: వివిధ పనుల నిమిత్తం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. గ్రామాల్లో సమయానుకూలంగా బస్సులు లేకపోవడంతో యాచారం, కందుకూరు, మాల్, ఇబ్రహీంపట్నం, హైదరాబాదు వరకు వివిధ పనుల నిమిత్తం వెళుతున్న ప్రయాణికులను ఆటో, టాటా ఏసీ డ్రైవర్లు పరిమితికి మించి తరలించడం వల్ల అవి అదుపు తప్పుతున్నాయి. వాటి కెపాసిటీ వరకే కాకుండా అంతకు మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. ఇటీవల కాలంలోనే నంది వనపర్తి, గ్రామానికి చెందిన మహిళా కూలీలు పత్తి ఏరడానికి మల్లేపెల్లి, వరకు వెళ్లి గమ్యస్థానాలకు చేరుకుంటున్న తరుణంలో ఆటో ప్రమాదానికి గురికాగా 12 మంది వరకు గాయపడగా ఒకరు మృతి చెందారు. మరొక ఘటనలో ఆటో వెనుక నుండి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి పరిమితికి మించి 20 నుంచి 25 మంది వరకు ప్రయాణికులను తరలిస్తూ ఉండడం వలన అవి అదుపు తప్పుతున్నాయి. గ్రామాల్లో ఇదివరకు ఉన్న బస్సు సర్వీసులను పునరుద్దించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
పరిమితికి మించి ఎక్కించుకోవద్దు
ఆటోలలో ఐదు మందికి మించి ఎక్కించుకోవద్దని తెలిపారు. ప్రతిరోజు తనిఖీలు చేసి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు గుర్తు చేశారు.:-హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ సీఐ కృష్ణంరాజు,
తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాం
ప్రతిరోజు మండల కేంద్రంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తూ ధ్రువీకరణ పత్రాలు, లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. చౌరస్తాలో ఎక్కడపడితే అక్కడ ఆటోలు నిలపకుండా పరిమితికి మించి ఎక్కించుకోకుండా అవగాహన కల్పిస్తున్నట్లు గుర్తు చేశారు.:-యాచారం సీఐ ఏ నరసింహారావు,