దిశ ఎఫెక్ట్ ; బోటింగ్ సాధ్యమే…తేల్చిచెప్పిన జిల్లా జేఏసీ చైర్మన్
ప్రభుత్వం, స్థానిక పాలకులు అనుకుంటే కొత్తచెరువులో బోటింగ్ సాధ్యమేనని జేఏసీ జిల్లా చైర్మన్ ముకుంద నాగేశ్వర్ అన్నారు.
దిశ, పరిగి : ప్రభుత్వం, స్థానిక పాలకులు అనుకుంటే కొత్తచెరువులో బోటింగ్ సాధ్యమేనని జేఏసీ జిల్లా చైర్మన్ ముకుంద నాగేశ్వర్ అన్నారు. దిశ దినపత్రికలో శనివారం వచ్చిన కొత్త చెరువులో బోటింగ్ సాధ్యమేనా..? అనే కథనానికి స్పందించారు. వేల కోట్లతో వేల ఎకరాల్లో మూసీ నదిని సుందరీకరిస్తున్న ప్రభుత్వానికి 40 ఎకరాలలోపు ఉన్న కొత్తచెరువును పునరుద్ధరించడం సాధ్యమే అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం ఒక చెరువును సుందరవీకరించి వేలాడే వంతెనను కూడా ఏర్పాటు చేసిందన్నారు. పరిగిలోని కొత్తచెరువును మొదటగా చెరువు కట్టను పునరుద్ధరించాలన్నారు. చెరువు ఎఫ్ టి ఎల్ పరిధి నిర్ణయించి ఫెన్సింగ్ వేయాలన్నారు. ఎఫ్ టి ఎల్ పరిధిలో అనుమతి లేని కట్టడాలను తొలగించాలన్నారు. ప్రభుత్వం అనుమతించిన కట్టడాలు ఉంటే వాళ్లకు నష్టపరిహారం చెల్లించి హైడ్రా తరహాలో పనులు చేపట్టాలన్నారు. కూడు, గూడు, గుడ్డ ప్రజల హక్కు వాటిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంటుంది. కాబట్టి ఎఫ్ టి ఎల్ పరిధిలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే వారికి ప్రభుత్వం వేరే చోట ఇంటిని కేటాయించాలన్నారు.
“ వర్షాకాలంలో చెరువులోకి నీటిని తీసుకువచ్చే కాలువలను, ఫీడర్ చానల్స్ ని పునరుద్ధరించాలి. చెరువులో ఎల్లప్పుడూ నీరుండే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తి చేసి ఆ నీటితో కొత్తచెరువును కూడా నింపాలన్నారు. గతంలో చెరువుకు భూములు ఇచ్చిన రైతులకు చెరువులో నీళ్లు లేని సమయంలో ఒక పంట చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రైతులతో మాట్లాడి వారికి వేరే చోట భూమిని కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలి. చెరువులో లే-ఔట్ కు అనుమతినిచ్చిన అధికారి లేదా సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇంకెవరు చెరువుల భూముల జోలికి రాకుండా శిక్షించాలి.
చెరువులో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తెలిసో తెలియకో చెరువులో ప్లాట్లు కొనుగోలు చేయడం కూడా తప్పే కావున ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు అమ్మకం దారులు ప్లాటుకు ప్లాటు లేకపోతే ప్లాటుకు విలువను” కట్టియాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వం వారికి సముచిత న్యాయం చేయాలన్నారు. సుమారు 6 కోట్లతో గతంలో శంకుస్థాపన చేయబడిన లక్నాపూర్ ప్రాజెక్టు సుందరీకరణ పూడికతీత పనులు ఇప్పటికీ పూర్తికాలేవని తప్పు పట్టారు. వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి బోటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తే మన ప్రాంతం పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. కొత్తచెరువు మూడెకరాలే అంటున్న ఇరిగేషన్ అధికారులు ఆయా సర్వే నెంబర్లను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం సర్వే చేస్తే చెరువు విస్తీర్ణం తెలిసి పోతుందన్నారు.