Dog attacks: కుక్కలతో బెంబేలు.. మాంసపు వ్యర్థాలకు అలవాటై స్వైర విహారం

కుక్కల భయంతో రోడ్లపై జనం నడవాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2024-07-26 02:59 GMT

దిశ, షాద్‌నగర్: కుక్కల భయంతో రోడ్లపై జనం నడవాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. అలాంటి భయానక వాతావరణమే గురవారం కొందుర్గు మండల కేంద్రంలో ఉదయం చోటుచేసుకుంది. నిత్యావసరాల కోసం రోడ్డుపైకి వచ్చిన కర్నూల్‌కు చెందిన గురు రాజన్‌పై శునకాలు దాడి చేశాయి. దీంతో కాలుకు తీవ్ర గాయమైంది. అటుగా ఆటో దిగి వస్తున్న ముత్యాలమ్మపై కుక్కలు ఎగబడి దాడికి పాల్పడ్డాయి. మరో ముగ్గురిని కరవడంతో వారంతా ప్రస్తుతం కొందుర్గు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కాగా అందరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. పలుమార్లు గ్రామ పంచాయతీలో కుక్కల బారి నుంచి తమను కాపాడాలని, మాంసపు వ్యర్థాలను రోడ్డు పక్కన వేయకుండా చర్యలు చేపట్టాలంటూ మొరపెట్టుకున్నా అధికారులు మాత్రం స్పందించిన పాపాన పోలేదు. మాంసపు వ్యర్థాలకు అలవాటైన కుక్కలు చిన్నా, పెద్దా తేడా లేకుండా దాడి చేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నా యి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి జనాలను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.  

Tags:    

Similar News