గ్రూప్​–1 ప్రిలిమ్స్​ పరీక్షకు పకడ్బంది ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అమోయ్​ కుమార్​

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.

Update: 2022-10-12 14:00 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లతో సమీక్ష నిర్వహించారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేలా పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలని చైర్మన్ సూచించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు, కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల గురించి సవివరంగా తెలియజేశారు. ప్రతి అభ్యర్థికి సంబంధించి బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలను తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. ప్రతి 60 మంది అభ్యర్థులకు ఒక బయో మెట్రిక్ యూనిట్ ను అందుబాటులో ఉంచేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బయోమెట్రిక్ విధానం అమలులో ఉన్నందున పరీక్ష ప్రారంభం అయ్యే నిర్ణీత సమయానికి కనీసం రెండు గంటల ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.

ప్రతి పరీక్ష గదిలోనూ తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రిలిమ్స్ నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా, లేదా అన్నది ముందుగానే క్షేత్ర స్థాయిలో సరిచూసుకోవాలన్నారు. ఉదయం10.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లను మూసి వేస్తారని, పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని తెలిపారు. అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించే ముందు పరీక్షవేదిక ప్రవేశ ద్వారం వద్ద పరిశీలిస్తారని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అభ్యర్థులు చెప్పుల మాత్రమే ధరించి రావాలని బూట్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కోసం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతించబడుతుందని అన్నారు. ఫిజికల్ హ్యాండ్ క్యాప్ అభ్యర్థులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే వసతి కల్పించారని, అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, ఓఎంఆర్ జవాబు పత్రంలో బుక్లెట్ సంఖ్య, వేదిక కోడ్ సరిగ్గా వేయాలన్నారు. ఉదయం 10.30 నుండి మధ్యాన్నం ఒంటి గంట వరకు కొనసాగే ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 51,718 మంది అభ్యర్థులు హాజరు అవుతారని తెలిపారు.

అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా 128 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని సూచించామన్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఎవరికైనా సందేహాలు, సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా 04023235642, 04023235643 ఫోన్ నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చైర్మన్ కు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News