నన్ను పోలీసులు పట్టుకోలేరు..తహసీల్దార్ ఆదేశాలపై అక్రమార్కుడి కామెంట్స్..
తహసీల్దార్ ఆదేశాలు తనపై పని చేయవని అక్రమార్కుడు
దిశ, రంగారెడ్డి నెట్వర్క్ : తహసీల్దార్ ఆదేశాలు తనపై పని చేయవని అక్రమార్కుడు పేర్కొనటం విశేషంగా మారింది.అక్రమార్కుడి వెనకాల పోలీస్ శాఖ పనిచేస్తుందని తద్వారా ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఒక్కడి వల్ల డీలర్లకు,పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తుందని పలువురు పేర్కొన్నారు.బషీరాబాద్ మండలం నుంచి కర్ణాటక కి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు దిశ పత్రికలో వచ్చిన కథనంపై బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేష్ సోమవారం డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి అక్రమ రేషన్ బియ్యం తరలింపు నియంత్రణకు చర్యలు చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న అక్రమార్కుడు తహసీల్దార్ ఆదేశాలపై ఇలా కామెంట్ చేశాడు.ఎవరి ఆదేశాలు తన వద్ద పనిచేయవని పోలీస్ శాఖకు చెందిన ఇరు విభాగాల సిబ్బంది కొంతమంది తన గుప్పిట్లో ఉన్నారని అక్రమార్కుడు పేర్కొన్నట్లు విశ్వాసనీయ సమాచారం. రేషన్ బియ్యం సరఫరాకు సహకరిస్తున్న కొంతమంది పోలీస్ సిబ్బందికి ప్రతి నెలా మామూళ్లు ఇస్తున్నట్టు సమాచారం.ఇదే పనిగా తరుచు ఠాణాకు వెళుతు సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకుని వారికి అతిథి మర్యాదలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపై ఖాకీ చొక్కా వేసుకొని కక్కుర్తికి పాల్పడుతూ పోలీస్ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని అన్నారు. పలు కీలక విషయాల్లోనూ వ్యవహరిస్తూ ఫిర్యాదుదారుల నుండి డబ్బులు తీసుకుని ఇద్దరికీ అందిస్తున్నట్టు విమర్శలు సైతం లేకపోలేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పై నిఘా ఉంచి సిబ్బంది లోపాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆ శాఖ కు మంచి పేరు వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అక్రమాలు..
బషీరాబాద్ మండల కేంద్రంలో నివాసముంటున్న ఓ అక్రమార్కుడు పోలీసులకు అతిథి మర్యాదలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మండల కేంద్రంలోని పలువురితో జతకలసి గ్రామాల నుండి బియ్యం సేకరించి పోలీసుల అండదండలతో రాత్రివేళలో కర్ణాటక సరిహద్దులు దాటిస్తు నిత్యం అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఆయనతో పాటుగా మరికొంతమందిని తన బాటలోనే నడిపిస్తు వారివాద్దనుండి ప్రతి నెలా మామూళ్లు తీసుకుని పోలీసులకు ఇస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
గ్రామీణ సీఐ శ్రీనివాస్ రెడ్డి వివరణ..
పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు వార్తలు ప్రచురితమైన , లేదా బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసినచో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామీణ సీఐ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.