అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విన్నపం
అకాలవర్షం ధాటికి భారీ నష్టం వాటిల్లింది.
దిశ, యాచారం: అకాలవర్షం ధాటికి భారీ నష్టం వాటిల్లింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా సోమవారం తెల్లారుజామున ఉరుములు, మెరుపులతో కూడినా గాలివానతో మంచాల, యాచారం పరిధిలో వ్యవసాయ పంటలు నేలకొరిగాయి. వందలాది ఎకరాల్లో మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామ పంచాయతీలతోపాటు మండలంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు వందల ఎకరాలలో వరి పంట చేతికి వచ్చే సమయంలో నేలకొరిగింది.
రైతు కోనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన ధాన్యం గాలి దుమారనికి వడ్లపై కప్పిపెట్టిన కవర్లు ఎగిరిపోయాయి. దీంతో వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి. రైతులు లబోదిబోమంటున్నారు. మామిడి తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. చెట్లు నేలకొరిగాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదని వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.