దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీని నిలువరించడంతో పాటు రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్‌ను అడ్డుకుంటామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభలు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో కొనసాగుతున్నాయి. ఈ మహాసభలను ఉద్దేశించి వీరయ్య మీడియాతో మాట్లాడారు. దేశంలో వ్యవసాయరంగం చాలా ప్రధానమైనదని, వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేంద్రం సమగ్ర శాసనం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష, నిర్లక్ష్య ధోరణిని విడనాడి, రాష్ట్రానికి నిధులిచ్చి సాయపడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలవారు, చేతివృత్తిదారులు ఉన్నారని, వారికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించి, వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ధరణి అమలులో జరుగుతున్న లోపాలను సరిచేసి పాసు పుస్తకాలు ఇవ్వాలన్నారు. జాతీయ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ ప్రణాళిక రూపొందించాలన్నారు. దేశవ్యాప్తంగా అమలు అవుతున్న వివిధ స్కీంలలో సుమారు కోటి మంది పనిచేస్తున్నారని, వీరందరినీ కార్మికులుగా గుర్తించి, ఈ స్కీముల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 104 ఎంబీసీ కులాల్లో 30 శాతం జనాభా ఉందని, వీరి సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు.
సింగరేణి కోల్ బెల్ట్‌లో నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా.. ఆర్టీసీ విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, ఆర్టీసీకి ప్రత్యేక నిధులిచ్చి, కార్మికుల ప్రజాతంత్ర హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం కుల, మత రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ, కులగణన చేసేందుకు నిరాకరిస్తోందని, కేంద్రం వెంటనే కులగణన జరపాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, రంగారెడ్డి జిల్లా సీపీఎం కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, డి.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.