CM Revanth Reddy : హైడ్రా వేటు తప్పాలంటే తప్పుకోవాల్సిందే..
రాష్ట్రంలో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాచేస్తే హైడ్రా
దిశ, గండిపేట్ : రాష్ట్రంలో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాచేస్తే హైడ్రా ఉపేక్షించదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్రమార్కులకు హెచ్చరించారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి సహకరించాలని ఆయన సూచించారు. లేదంటే హైడ్రా ఉక్కుపాదం కింద నిలిగిపోవాల్సిందేనని ఆయన స్పష్టతనిచ్చారు. ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేసిన వారు ఎంతటి వారైనా అందరికీ సమాధానం ఒక్కటేనని, కూల్చివేతలే మార్గమని వెల్లడించారు. ఆక్రమ నిర్మాణాలు చేసిన వారు ఎవరైనా కూల్చివేతలు తథ్యమన్నారు. బుధవారం హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో జరిగిన పోలీస్ పాసింగ్ పరేడ్ కు ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పెద్దలు అని చెప్పుకునే వారు ప్రాజెక్టుల వద్ద అక్రమంగా ఫాంహౌస్‌లు కడుతున్నట్లు తెలిపారు. ఆ ఫాంహౌస్‌ల నుంచి డ్రైనేజీ నీటిని హైదరాబాద్ నగరానికి మంచి నీటిని అందించే గండిపేట లాంటి జలాశయాల్లోకి వదులుతున్నారని అన్నారు. దీంతో నగరవాసులు అనేక వ్యాధులకు గురవుతున్నట్లు వివరించారు. ఇక నాలాల దురాక్రమణ వల్ల వచ్చే వరదలతో అనేక ప్రాంతాలు ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలు నీటి మునిగిపోతున్నాయన్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించబోయేది లేదన్నారు. కబ్జాదారులు తన మాటలు పెడచెవిన పెట్టకూడదని, కూల్చివేతలు చేపట్టడానికి హైడ్రా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్మాణాలపై స్టేలు తెచ్చుకున్నా.. వెనుకడుగు వేయబోమని, కోర్టులో తమ వాదాన్ని వినిపించి విజయం సాధిస్తామన్నారు.
త్వరలో మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుడతామని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్న నిరుపేదలకు న్యాయం చేస్తామని, వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు నష్టం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారికీ న్యాయం జరిగేలా చొరవ చూపుతున్నామన్నారు. తాము అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 35 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ప్రజల జీవితాలను పీల్చి పిప్పి చేస్తున్న నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా సైబర్, గంజాయి వంటి నేరాలను కూకటివేళ్లతో పీకేస్తామని ఆయన వెల్లడించారు. పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు