డిలీటేషన్ పేరుతో పట్టా భూమికి ఎసరు!.. రియల్ వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు
ధరణితో రైతులు కొత్త కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. తమ భూమిని తమదే అని చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.
దిశ, రంగారెడ్డి బ్యూరో: ధరణితో రైతులు కొత్త కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. తమ భూమిని తమదే అని చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం రెవెన్యూ అధికారులు రైతులతో ఆటలాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధీనంలోనున్న భూములనే రియల్ వ్యాపారులు కాజేస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ, పట్టా భూములను సైతం రియల్ వ్యాపారులు అధికారులను లంచాలతో ప్రభావితం చేసి కాజేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రెవెన్యూ పరిధిలోని వర్టెక్స్ అనే రియల్ వ్యాపారి పట్టా భూములపై కన్నేశాడు. అయితే, అమాయక రైతుల వద్ద అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి లేఅవుట్ వేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే విక్రయాలకు ఆసక్తి చూపని రైతులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా వారి పట్టా భూములను లాగేసుకునేందుకు స్ధానిక తహసీల్దార్ కార్యాలయంలోని, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ధరణికి సంబంధించిన అధికారులతో వర్టెక్స్ రియల్ వ్యాపారి కుమ్మక్కైనట్లు తెలుస్తోంది.
ధరణిలో తొలగించేందుకు ప్రయత్నాలు..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.777లో 19 ఎకరాల 18 గుంటల భూమి ఉంది. ఇందులో 16 మంది రైతులున్నారు. కేవలం 9 మంది రైతులు 10 ఎకరాల 6 గుంటల భూమిని వర్టెక్స్ వర్మకు విక్రయించారు. మిగిలిన 7 మంది రైతులు అధీనంలో 5 ఎకరాల 12 గుంటల భూమి విక్రయించేందుకు ఆసక్తి చూపలేదు. ఎందుకంటే వర్టెక్స్ వర్మ ఎకరాకి ఇచ్చే ధర నచ్చకపోవడంతో రైతులు విక్రయించ లేదు. కానీ, ఆ భూమి విక్రయిస్తే పూర్తిస్ధాయిలో లేఅవుట్ చేసేందుకు అనువుగా ఉంటుందని వర్మ భావించారు. దీంతో ఏలాగైన రైతుల భూమిని కాజేయాలనే దురాలోచనతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైనట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే వర్టెక్స్ వర్మ సర్వే నెం.777లో గతంలో విక్రయించిన భూ డాక్యుమెంట్ ఆధారంగా మిగిలిపోయిన భూమిని ధరణి నుంచి తొలగించేందుకు గతంలో పని చేసిన తహశీల్దార్‌తో ఒప్పందం కుదుర్చుకుని డిలీటేషన్ ఆప్షన్ పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని వారు వెల్లడించారు. కలెక్టర్ స్ధానిక తహసీల్దార్‌ను పరిశీలించాలని ఆదేశించారు. అంతలోనే స్ధానిక తహశీల్దార్ బదిలీ కావడంతో కొన్ని రోజులు పెండింగ్‌లో పడింది. ప్రస్తుతం ధరణి ధరఖాస్తులు పరిశీలిస్తున్న నేపథ్యంలో రైతులు మరోసారి అధికారులు సంప్రదించారు. దీంతో తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్వపర్వాలు తెలుసుకొని రిపోర్ట్ ఇచ్చారు.
కానీ, కలెక్టరేట్‌లోని ధరణికి సంబంధించిన అధికారులు కావాలని జాప్యం చేస్తూ మరోసారి రిపోర్ట్పంపాలని తహసీల్దార్‌కు తిప్పి పంపించారు. స్థానిక తహసీల్దార్ స్పష్టంగా ఆ సర్వే నెంబర్లోని భూ వివరాలతో రిపోర్ట్ పంపినప్పటికీ కలెక్టరేట్ కార్యాలయంలోని అధికారులు దురుద్దేశ్యంతో వెనక్కి పంపినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే 777 సర్వే నెం. మరో 4 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి గతంలో వర్టెక్స్ వర్మకు విక్రయించిన రైతులదేనని తెలుస్తోంది. ఆ భూమిలో పోజిషన్ లేకపోవడంతో ఆ భూమిని కూడా అక్రమంగా కాజేస్తుందుకు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తమకు అనుకూల ధరకు భూమిని విక్రయించకుంటే అక్రమ పద్దతికి తెరలేపినట్లుగా సమాచారం.
రైతుల ఘోస పట్టించుకునేది ఎవరు?
ప్రజల కోసమే పనిచేస్తామని అటు ప్రభుత్వాలు, అధికారులు అంటుంటారు. కానీ కేవలం ఆమాటలు ప్రచారం కోసమేనని తెలుస్తోంది. అధికారులు కాసులకు ఆలవాటు పడి దోడ్డి దారిన పనిచేసేందుకు వెనకడుగు వేయడం లేదు. రైతులు చెప్పే సమస్య నిజంగా సరైంది కాదా అని తెలుసుకోవడానికి నెలలు, ఏళ్లు పట్టదు. ఆ రైతులు వాస్తవంగా భూమి వారి అధీనంలో ఉందా.. వర్టెక్స్ వర్మ అధీనంలో ఉందా తెలిసిపోతుంది. అవేమీ పట్టించుకోకుండా కేవలం బలవంతులైన రియల్ వ్యాపారులు ఇచ్చే ముడుపులకు అధికారులు తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా రైతులు చెప్పే ఆవేదనలో నిజముంటే న్యాయం చేసి అధికారులు విలువను కాపాడుకోవాలని పలువురు వేడుకుంటున్నారు.