Buying centers : ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు రెడీ..
వానాకాలం సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది.
దిశ, రంగారెడ్డి బ్యూరో : వానాకాలం సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ముందుగా ప్రతి మండలంలో ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించనుండగా, వచ్చే నెల చివరినాటికి పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. రంగారెడ్డి జిల్లాలో 45, వికారాబాద్ జిల్లాలో 130 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఎంసీ, ఐకేపీ, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ల ఆధ్వర్యంలో ధాన్యాన్ని సేకరించనున్నారు. ఏ-రకం వరి ధాన్యం రూ.2320+500, సాధారణ రకం రూ.2300 గా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో 80 వేల మెట్రిక్ టన్నులు, వికారాబాద్ జిల్లాలో 1,05,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సివిల్ సప్లయ్ శాఖాధికారులు అంచనా వేశారు.
విక్రయించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు..
కేంద్రాలకు వచ్చిన ధాన్యం వచ్చినట్లు కొనుగోలు చేసేలా అధికారులు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దళారుల చేతిలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్నిరకాల ఏర్పాట్లను సివిల్ సప్లై అధికారులు చేశారు. పంట దిగుబడిని బట్టి ముందుగా అంచనా వేసి ధాన్యం సేకరించేందుకు అవసరమైన గోనె సంచులను, నిల్వ ఉంచేందుకు గోదాములను సిద్ధం చేశారు. ప్రతి రైతు గింజను కొనుగోలు చేసేలా ప్రతి మండలంలో అవసరమైన చోట కేంద్రాల ఏర్పాటుకు వ్యూహరచన చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనవరి నెల చివరి వరకు ధాన్యం సేకరణ జరుగుతుందని తెలిపారు. తూకాల్లో కూడా ఎలాంటి నష్టం రైతులకు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించారు. ఏ గ్రేడ్ రూ.2,320, సాధారణ రకం వడ్లకు రూ.2,300 ఇవ్వగా సన్నవడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరించిన వారం రోజుల్లో రైతు అకౌంట్లో నగదు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వికారాబాద్‌లో 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు కలిపి మొత్తం 175 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని 45 కేంద్రాల్లో ఐకేపీ 6, పీఏసీఎస్ 31, డీసీఎంఎస్ 8 చొప్పున ఆయా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు కొనసాగనున్నది. వికారాబాద్ జిల్లాలో 130 కేంద్రాల్లో పీఏసీఎస్ 61, డీసీఎంఎస్ 27, ఏఎంసీ 3, ఎఫ్‌సీఎస్ 4, ఐకేపీ 35 చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకంగా 18 సెంటర్లు సన్న వడ్ల సేకరణకు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 8-10 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ తేదీన ధాన్యాన్ని తీసుకురావాలన్న విషయమై ఏఈవోలు టోకెన్ అందజేస్తారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు జిల్లాలో 59 గోదాములను సిద్ధంగా ఉంచారు.
రంగారెడ్డిలో దిగుబడి తక్కువ..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కలిపి లక్షా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా.. 50 వేల మెట్రిక్ టన్నులు సన్నాలు, 30 వేల మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం.. అదే వికారాబాద్ జిల్లాలో లక్షా 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 42వేల మెట్రిక్ టన్నులు సన్నాలు, 63 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం వస్తుందని అంచనా వేశారు. వానాకాలం సీజన్ ధాన్యం సేకరణ ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వం సీరియస్‌గా ఆదేశించింది. గత వానాకాలంలో రంగారెడ్డి జిల్లో 20 వేల మెట్రిక్ ధాన్యం, యాసంగిలో 12 వేల మెట్రిక్ ధాన్యం సేకరించారు. ఈ ఏడాది ధాన్యం అధికంగా వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. కానీ వికారాబాద్ జిల్లాతో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ అత్యంత తక్కువగా దిగుబడి వస్తుంది. గతేడాది మద్దతు ధరతో పోలిస్తే రూ.117లు అదనంగా మద్దతు ధర చెల్లించగా.. సన్నవడ్లకు అదనంగా మరో రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. ఏ రకమైతే రూ.117, బీ రకమైతే రూ.97లు.. అదే సన్న వడ్లకు ఏ రకానికి రూ.617, బీ రకానికి రూ.597లు ఇవ్వడం గమనార్హం.