దిశ ప్రతినిధి వికారాబాద్ : గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శనివారం గురుకుల పాఠశాలల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల సంక్షేమ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మంచి సౌకర్యాలు కల్పించాలన్నారు. మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. విద్యార్థులకు అనుగుణంగా ఫ్యాన్స్ , లైట్లు అమర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంజూరు చేసిన నిధులతో విద్యుత్తు, ప్లంబర్ పనులు చేపట్టడమే కాకుండా టాయిలెట్స్, నల్లాలు, గోడల పగుళ్లు, ఫ్లోరింగ్, పై కప్పు నీరు లీకేజీ లాంటి మరమ్మత్తు పనులను చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పాఠశాల భవనాల పైన నీరు నిల్వ ఉండకుండా, పైకప్పుల మరమత్తు పనులు చేపట్టాలని ఆయన తెలిపారు. పనులు చేపట్టకముందు, పనులు పూర్తి అయిన తర్వాత తీసిన ఫోటోలను సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి, మిషన్ భగీరథ ఇఇ బాబు శ్రీనివాస్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.