మా గోడు వినేది ఎవరు..? 14 ఏళ్ల నిరీక్షణకు తెరపడేది ఎప్పుడు..?
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో ఉన్న డిఎస్సి 2008 మెరిట్ అభ్యర్థుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
దిశ ప్రతినిధి వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో ఉన్న డిఎస్సి 2008 మెరిట్ అభ్యర్థుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. 14 ఏళ్ల నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో, మా ఉద్యోగాలు మాకు ఎప్పుడు వస్తాయో అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ ఆశతోనే వికారాబాద్ జిల్లాకు ఏ మంత్రి వచ్చిన, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లాకు వచ్చిన ప్రతిసారి క్రమం తప్పకుండ వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం.
మంత్రి సానుకూలంగా స్పందించినప్పటికీ మా సమస్య మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2008వ సంవత్సరంలో నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉత్తిర్ణత పొంది మెరిట్ సాధించి కౌన్సిలింగ్‌లో కూడా సెలెక్ట్ అయినా ఉద్యోగాలు రాని పరిస్థితి. దాని వెనుక అసలు కారణం ఏంటి..? ఈ తప్పిదం విద్యాశాఖ అధికారులదా..? నాటి ప్రభుత్వందా అన్నది పక్కన పెడితే, డిఎస్సికి అన్ని అర్హతలు ఉండి, సెలెక్ట్ అయినా మాకు ఉద్యోగాలు రాక, కాయకష్టం చేసుకొని చాలి చాలని జీతాలతో బ్రతుకుతున్న మా కష్టాలు తీరడమే ప్రధాన లక్ష్యం అంటూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకుంటున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి
14 ఏళ్లుగా కోర్టు కేసులు, ఆమరణ నిరాహార దీక్షలు, జైళ్లు, వినతి పత్రాలు ఇస్తూ శాంతియుతంగా వేడుకుంటున్నాము. దాని ఫలితంగా గత రెండు నెలల క్రితం సెప్టెంబర్ 27న మాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా ఉద్యోగాల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. 2016వ సంవత్సరంలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక వరంగల్ భారీ బహిరంగ సభలో సీఎం ఓదాలో మానవతా దృక్పధంతో డిఎస్సి 2008 మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయిస్తాం అని మొట్టమొదటిసారి హామీ ఇచ్చారు. ఆ మాట నేడు నిలబెట్టుకొని ప్రభుత్వం మాకు త్వరలోనే ఉద్యోగాలు కేటాయింపు చేస్తారని ఆశతో ఎదురుచూస్తున్నామని వికారాబాద్ జిల్లాకు చెందిన డిఎస్సి 2008 మెరిట్ అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.