తెరపైకి హిందూ సంఘాల మరో కీలక డిమాండ్.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన

ఒకవైపు దేశవ్యాప్తంగా రామ మందిర నిర్మాణం తర్వాత ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉండగా

Update: 2024-02-19 12:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకవైపు దేశవ్యాప్తంగా శ్రీరామ మందిర నిర్మాణం తర్వాత ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉండగా మరోవైపు మధుర లోని శ్రీ కృష్ణ దేవాలయాన్ని సైతం ఇలాగే పునర్నిర్మాణం చేయాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో దీన్ని జీర్ణించుకోలేని కొందరు శ్రీరాముడు, శ్రీకృష్ణులపై తరచూ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని దీనికి పరిష్కారంగా శ్రీరామ శ్రీకృష్ణులకు గౌరవ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు హిందూ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కి హిందూ సంఘాలు లేఖ రాశాయి. హిందువులంతా భగవంతుని స్వరూపంగా కొలిచే శ్రీ రాముడు, శ్రీ కృష్ణులపై ఎవరైనా అనాలోచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన శిక్ష విధించేలా న్యాయపరమైన విధివిధానాలను రూపొందించాలని లేఖలో హిందూ సంఘాలు కోరాయి.

 

అలహాబాద్ హైకోర్టు కూడా గతంలో ఇలాంటి ఒక చట్టాన్ని రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసిన విషయాన్ని హిందూ సంఘాలు గుర్తు చేశాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చేస్తున్న విపరీత వ్యాఖ్యలకు ముగింపు పలకాలని హిందూ సంఘాల నేతలు కోరుతున్నారు. రైతు సంఘాల ధర్నా కారణంగా ఢిల్లీ అంతటా 144 సెక్షన్ అమల్లో ఉండడంతో తాము చేపట్టాల్సిన దీక్ష వాయిదా పడిందని, వచ్చేనెల తప్పకుండా దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని హిందూ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శివశక్తి ఆర్గనైజేషన్ నుంచి కరుణాకర్ సుగ్గున , కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి , భాస్కర్ కిల్లి. హిందూ జనశక్తి సంస్థ నుంచి లలిత్ కుమార్, శ్రీనివాస్, రాష్ట్రీయ దళిత సేన నుంచి వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News