రేవంత్ కేబినెట్‌లో ఆ మంత్రులు ఇద్దరు కీలు బొమ్మలే: రాకేష్ రెడ్డి ఫైర్

రాష్ట్ర స్పెషల్ పోలీస్ నియామకాలకు జీవో 46 నుంచి మినహాయింపు కల్పించి, జీవో 46 బాధితులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం

Update: 2024-06-26 15:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర స్పెషల్ పోలీస్ నియామకాలకు జీవో 46 నుంచి మినహాయింపు కల్పించి, జీవో 46 బాధితులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని వారికి అన్యాయం చేస్తోందని ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వమే బాధితులతో బంతి ఆట ఆడుతోందని మండిపడ్డారు. అమయాక యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. 20 సార్లకు పైగా కోర్టులో వాదనలు వాయిదా పడటం ప్రభుత్వ పుణ్యమేనంటూ విరుచుకుపడ్డారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్లేట్ ఫిరాయించాడని విమర్శలు చేశారు. ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తుందన్నారు.

అడ్వకేట్ జనరల్‌తో కూడా అబద్ధాలాడిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జీవో 46పై కాంగ్రెస్ వైఖరేంటో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యక్ష, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ఏడాది కాలంగా తమ హక్కుల కోసం కోట్లాడుతున్న జీవో 46 బాధితులకు సంబంధించిన కేసు బుధవారం హైకోర్టులో వాద, ప్రతివాదనకు వచ్చిందని, కానీ ప్రభుత్వ తరుపు న్యాయవాది, అడ్వకేట్ జనరల్ కృత్రిమ కారణాలు చెప్పి వాయిదా వేయించారంటూ రాకేశ్ రెడ్డి విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తప్పని కోర్టు తీర్పు రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

జీవో 46పై ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు దుద్దిళ్ల శ్రీధరర్ బాబు, దామోదర్ రాజనర్సింహ ఇటీవల తమ నిరసనలకు తలొగ్గి తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెట్టారని, అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కనీస చలనం లేదన్నారు. మంత్రులిద్దరూ కేవలం కీలు బొమ్మలేనా అంటూ ఎద్దేవాచేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోర్టులో సహజ న్యాయ ప్రక్రియకు అడ్డుపడకుండా జీవో 46 బాధితులకు న్యాయంచేయాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులకు పరిష్కారం దొరికే వరకు కొట్లాడుతానని ఆయన స్పష్టంచేశారు.


Similar News