RAJYASABHA MP: మోడీ వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే.. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

ప్రధాని మోడీ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు అభివృద్ధి ఇంకా ముందుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Update: 2024-09-18 16:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు అభివృద్ధి ఇంకా ముందుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టుపై తాము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు డిబేట్ కు సిద్ధమేనా? అని లక్ష్మణ్ సవాల్ విసిరారు.

దేశంలో మోడీ పాలన మెచ్చి ప్రజలు పట్టం కడితే, కాంగ్రెస్.., రాహుల్ జీర్ణించుకోలేక అబద్ధపు ప్రచారంతో దాడి చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించకుండా, విదేశాలకు వెళ్లి అక్కడ దేశంపై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోడీపై నిందలు వేయడం ఆయనకు పరిపాటిగా మారిందని చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుందన్నారు. అయితే పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా స్కీములు, విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, రైల్వేలు, భద్రత ఇలా అనేక రంగాల్లో మోడీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వాటిని నెరవేర్చేలా నరేంద్ర మోడీ పాలన అందిస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని విమర్శలు చేశారు.


Similar News