Gandhi Bhavan : గాంధీభవన్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.. భట్టి హాట్ కామెంట్స్

గాంధీభవన్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

Update: 2024-08-20 09:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీభవన్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ పిల్లలకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. నాటి ప్రధాన మంత్రిగా ఈ దేశంలోకి టెక్నాలజీని తీసుకొని వచ్చి.. ఈ దేశం సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడేటట్లు చేసిన ఒక గొప్ప ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని తెలిపారు. దేశంలో మత సామరస్యం కోసం సద్భావన యాత్ర మొదలు పెట్టారని గుర్తు చేసుకున్నారు. కంప్యూటర్ రంగంలో భారత్ ముందు ఉండాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున కంప్యూటర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని, దీంతో నేడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు కంప్యూటర్ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ నగరం కంప్యూటర్ రంగంలో ముందుకు పోతుందని, దానికి కారణం నాటి కాంగ్రెస్ పార్టీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి నాయకత్వంలో మధాపూర్‌లోని హైటెక్‌సిటీకి వేసిన పునాది వేశారని, తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫైనాన్సియల్ సిటీ, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి వాటిని రాజీవ్ గాంధీ స్పూర్తితోనే ప్రణాళికలు పూర్తి చేసి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని స్పష్టంచేశారు. 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని తెలిపారు. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చేలా చేసింది కూడా రాజీవ్ గాంధీనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ గారు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, రోహిన్ రెడ్డి, అజారుద్దీన్, మెట్టు సాయి కుమార్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు.

Tags:    

Similar News