‘ఫస్ట్ టైమ్ ఇలా జరిగింది’.. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన రాజాసింగ్
తనను ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్న వ్యక్తిని గుర్తించడంపై తెలంగాణ పోలీసులకు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు చెప్పారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తనను ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్న వ్యక్తిని గుర్తించడంపై తెలంగాణ పోలీసులకు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు చెప్పారు. తాను కార్పొరేటర్‌గా ఉన్న నాటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు థ్రెంట్టింగ్ కాల్స్ వచ్చాయని.. వాటిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం వాటిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు బుక్ చేసి ఆ తర్వాత తనకు తెలియకుండానే ఆ కేసును క్లోజ్ చేసేవారని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన రాజాసింగ్.. ఇప్పటి వరకు పోలీసులకు తాను వందల ఫిర్యాదులు చేశానని కానీ ఒక్క కంప్లయింట్‌పై కూడా సరైన ఇంక్వైరీ జరగలేదని, ఫస్ట్ టైమ్ నాకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారని.. ఇప్పుడున్న పోలీస్ కమిషనర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.
కువైట్‌లో మకాం వేసిన మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేయాలని రాజాసింగ్ పోలీసులను కోరారు. కాగా మహమ్మద్ ఖాసిం గత 14 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్నారని, చాంద్రాయణగుట్ట నుంచి దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి కువైట్‌లో ఖాసిం సెటిల్ అయ్యాడని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్‌పై మమ్మద్ ఖాసిం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ఎల్‌ఓసీని జారీ చేశారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్‌కు ఖాసిం బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.