పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్.., బీజేపీ స్టేట్ ఆఫీస్ కు అత్యంత దగ్గరగా ఉన్న.. ఏకైక ఎమ్మెల్యే. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆయనే.
దిశ, తెలంగాణ బ్యూరో: గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్.., బీజేపీ స్టేట్ ఆఫీస్ కు అత్యంత దగ్గరగా ఉన్న.. ఏకైక ఎమ్మెల్యే. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆయనే. అలాంటి వ్యక్తిని పార్టీ లైట్ తీసుకుందా? లేక ఆయనే పార్టీని లైట్ తీసుకున్నాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. స్టేట్ ఆఫీస్ కు అతి సమీపంలో రాజాసింగ్ ఉన్నా.. పార్టీ కార్యక్రమాల్లో అందనంత దూరంలో ఉంటున్నారు. గతంలో హైదరాబాద్‌లో మునావర్ ఫారూక్ షో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ ఘాటు విమర్శలు చేశారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాల నుంచి అభ్యంతరాలు రావడంతో పార్టీ ఆయనపై వేటు వేసింది. పార్టీలో అందరికీ ఒకే రూల్ అని.. రాజాసింగ్ పార్టీ లైన్ దాటారని.. సస్పెండ్ ఎందుకు చేయవద్దో చెప్పాలని బీజేపీ హైకమాండ్ నోటీసులు సైతం జారీచేసింది. పార్టీ వేటు వేసిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆయన తీరు మారినట్లుగా కనిపిస్తోంది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 14 నెలలు సస్పెన్షన్ వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు సస్పెన్షన్ ను పార్టీ ఎత్తేసింది. అయితే అప్పటి నుంచి ఆయన క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఎన్నికల్లో గెలుపు తర్వాత కూడా అదే సీన్ కనిపించింది. ఎన్నికల అనంతరం ఆయన్నే యథావిధిగా బీజేఎల్పీ నేతగా కొనసాగిస్తారని ఆయన భావించారు. కానీ ఆయనను కాదని పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శాసనసభ పక్ష నేతగా ప్రకటించింది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మాట అటుంచితే కనీసం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన దాఖలాలు కూడా లేకపోవడం గమనార్హం. దీంతో ఆయన బీజేపీని లైట్ తీసుకున్నారా? అనే ప్రశ్నలు శ్రేణుల్లో ఉత్పన్నమవుతున్నాయి.
ఇదిలా ఉండగా గతంలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా దాదాపు అన్ని సందర్భాల్లో రాజాసింగ్ పేరును జాబితాలో ప్రకటించింది. కానీ తాజాగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ చేపట్టిన బస్తీ నిద్ర కార్యక్రమానికి మాత్రం ఆయన పేరు లిస్టులో లేకపోవడం గమనార్హం. గతంలో తరచూ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రకు వెళ్లే రాజాసింగ్ ను.. అక్కడ ప్రచారానికి వెళ్లే టీబీజేపీ నేతల జాబితాలో కూడా పార్టీ ఆయన పేరును పెట్టలేదు. అయితే గతంలో చేపట్టిన పార్టీ కార్యక్రమాల్లో ఆయన రాకపోవడం వల్లే.. ఈసారి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందా? అనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రతిసారి ఆయన పేరును పెట్టడం, ఆయన గైర్హాజరవ్వడం.. దానిపై మీడియా కథనాలు రావడం కంటే ఆయన పేరు లేకపోవడమే బెటర్ అని భావించి ఉంటారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ బస్తీ నిద్రతో పార్టీ రాజాసింగ్ ను లైట్ తీసుకుందా? లేక రాజాసింగే పార్టీని లైట్ తీసుకున్నారా? అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.