నకిరేకల్‌లో కారు ఖాళీ.. రాజగోపాల్ రెడ్డి వ్యూహమిదే..!
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భువనగిరి పార్లమెంట్ స్థానంలో రాజకీయం వేడెక్కుతుంది.
దిశ, నకిరేకల్ : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భువనగిరి పార్లమెంట్ స్థానంలో రాజకీయం వేడెక్కుతుంది. దీంతో ఇక్కడ రాజకీయం రోజుకో తీరుగా మారుతుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉన్న బీఆర్ఎస్ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమితులైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో దూకుడును పెంచారు. రోజుకో నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొంతమందిని పార్టీలో చేర్చుకొని తమ అభ్యర్థి గెలుపునకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కారు పార్టీని ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీలో చేరికలే టార్గెట్‌గా తమకు పరిచయం ఉన్న నాయకులతో మాట్లాడుతూ కండువాలు మారుస్తున్నారు. ఈనెల 28వ తేదీన నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్ పల్లి, చిట్యాల, కట్టంగూరు, నకిరేకల్ మండలాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ చేరికల ద్వారా ప్రత్యర్థి పార్టీల మనోస్థైర్యం దెబ్బతీయనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు తమకు పోటీ లేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం నకిరేకల్ నియోజకవర్గంలో కనుమరుగయ్యే స్థాయికి వెళ్ళిపోతుందంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనంతటికీ క్యాడర్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
28న చేరికలకు సిద్ధం...
ఈనెల 28న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో నకిరేకల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కండువాలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా ఎంపీపీ స్థాయి మొదలుకొని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, 20 మంది సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, దేవస్థానం చైర్మన్లు, వార్డు సభ్యులు, వివిధ స్థాయిలోని నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇప్పటికే ఒక దఫా రాజగోపాల్ రెడ్డితో, వేముల వీరేశంతో చర్చలు జరిపి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
మూడు పర్యాయాలు వీరి మధ్య పోటీ...
భువనగిరి పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనప్పటికీ తనే పోటీలో ఉన్నట్లుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో గత రెండు పర్యాయాలు బూర నర్సయ్య గౌడ్ తో ఢీకొన్న కోమటిరెడ్డి సోదరులు ప్రస్తుతం ఆయనను ఓడించేందుకు గట్టి ప్రణాళికలు చేస్తున్నారు. బీజేపీపై యువత మక్కువ పెంచుకోవడంతో ఆయనకు గెలుపు అవకాశాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయినా కోమటిరెడ్డి సోదరులు తమ బలాన్ని నిరూపించుకోవడానికి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తమ సత్తా నిరూపించుకోవాలని ముందుకు సాగుతున్నారు. దీనికి తోడు ఈ స్థానంలో భువనగిరి, ఆలేరు, నకిరేకల్ ,మునుగోడు, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా కేవలం జనగాం నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. అయితే ఇక్కడ మునుగోడు నకిరేకల్ నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి సోదరులు సొంత నియోజకవర్గాలు కావడం వారికి భారీగా కలిసి వచ్చే అవకాశం. అదే సమయంలో గతంలో సోదరులు ఇద్దరు భువనగిరి ఎంపీలుగా ఉండటం వల్ల భారీ క్యాడర్ సైతం వారికి ఉన్నది. ఇలా అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు.
కాంగ్రెస్ గెలిస్తే రాజగోపాల్ రెడ్డి మంత్రి....
భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో కోమటిరెడ్డి అభిమానులు తమ నాయకునికి మంత్రి పదవి వస్తుందని కిందిస్థాయి కార్యకర్తలకు చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే తమకు అనుకున్న పనులు జరుగుతాయని తమ అభిమానులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చని వాగ్దానాలు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రత్యర్థి పార్టీలను తనదైన శైలిలో దెబ్బతీస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం అదంతా డొల్ల అంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జరుగుతున్న ప్రచారంలో ఎవరిదిపై చేయి అవుతుందో తెలియాలంటే మరింత సమయం వేచి చూడాల్సిందే.