R.Krishnaiah: సీఎం రేవంత్ రెడ్డికి ఆర్.కృష్ణయ్య కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డికి ఆర్.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) స్వాగతించారు. కాలేజీ హాస్టళ్ల విద్యార్థుల మెస్ చార్జీలను (Mess Charges) రూ.1500 నుంచి రూ.2100 కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయితే తాము రూ.3000 డిమాండ్ చేసినప్పటికీ కనీసం రూ.2000 ఇస్తారని భావించామన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూ.2100 ఇచ్చారని ఇది మంచి నిర్ణయం అన్నారు. శనివారం హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఆసక్తి ఉందని ఈ నిర్ణయంతో అర్థం అవుతున్నదన్నారు. ఇదో కోవలో హాస్టళ్లలో స్టాప్ ను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లు పెంచాకే లోకల్ ఎన్నికలు పెట్టాలే:
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. పెంచబోయే రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు రాకుండా రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టైనా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నారు. బీసీలు తెగించి కొట్లాడితేనే ఉద్యమానికి రాజ్యంగబద్ధమైన హక్కులు లభిస్తాయన్నారు. 76 ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు బీసీ పోరాటాలను ((BC Movement)) నిలబడనివ్వనని అందువల్ల బీసీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.