ఐదు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల భారీ స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Update: 2024-05-12 16:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల భారీ స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది. ఈ నెల 17 వరకూ ఇదే వాతావరణం కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. హైదరాబాద్, శివారు ప్రాంతాల పరిధిలో వర్షాల తీవ్రత ఎక్కువ ఉంటుందని హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత విభాగాల అధికారులను అలర్టు చేశారు. ప్రజల గ్రీవెన్స్ కోసం 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ (నెం. 040-2111 1111, 90001 13667) ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ సైతం పోలింగ్ కేంద్రాల దగ్గర వర్షం నుంచి తట్టుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. పోలింగ్‌మీద వర్షం ప్రభావం లేకుండా చూసుకుంటున్నది.

వర్ష వాతావరణం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేసి వాతావరణ కేంద్రం.. కొన్ని జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీచేసింది. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొన్నది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఓక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి ఎగువన ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ, ఆగ్నేయ దిశలలో గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది. గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పులు దీని ప్రభావమేనని తెలిపింది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలియజేయడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.

మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సంతో పాటు పెద్దశంకరంపేట మండలంలో పిడుగు పాటుకు తాత, మనవడు మృతి చెందారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పడానికి వెళ్లగా, పిడుగుపాటుకు గురికావడంతో శ్రీరాములు (50), విశాల్‌ (11) అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంవల్ల పలు ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోయింది. ఈదురు గాలులకు ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయాయి. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు కరు చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. వారందరినీ స్థానికులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఎలక్షన్ స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ రోజున వర్షంపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఇన్నాళ్లు ఎండల కారణంగా ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వస్తారో రారో అనే సందేహాలతో ఉన్న రాజకీయ పార్టీలకు, ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆందోళన కలిగింది. ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షంతో పోలింగ్ సరళిపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే అలజడి మొదలైంది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునేలా గ్రామాల్లో అన్ని పార్టీల స్థానిక లీడర్లు అవగాహన కలిగిస్తున్నా వర్షం ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తుందో, పోలింగ్ పర్సంటేజీ ఏమవుతుందోనని రాజకీయ పార్టీలు ఆందోళనలో పడ్డాయి. ఏయే గ్రామాల్లో ఏ పార్టీకి ప్రజలు ఎక్కువ ఆదరణ చూపుతున్నారో అంచనా వేసిన పార్టీలు ఎండా వానలతో సంబంధం లేకుండా పోలింగ్ కేంద్రాలకు పంపించేలా మరింత అవగాహన కలిగించాలని భావిస్తున్నాయి.

Tags:    

Similar News