రాయదుర్గం సర్వే నం.46.. రూ.10 వేల కోట్ల ప్రాపర్టీ సర్కారుదే

హైదరాబాద్ లోని రాయదుర్గ్ పాయిగా ల్యాండ్ కేసు అనేక మలుపులు తిరిగింది. ఎట్టకేలకు అది ప్రభుత్వ భూమిగా సుప్రీం కోర్టు తేల్చేసింది. దశాబ్దాలుగా నడుస్తున్న కేసుకు ముగింపు పలికింది.

Update: 2024-07-23 10:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:హైదరాబాద్ లోని రాయదుర్గ్ పాయిగా ల్యాండ్ కేసు అనేక మలుపులు తిరిగింది. ఎట్టకేలకు అది ప్రభుత్వ భూమిగా సుప్రీం కోర్టు తేల్చేసింది. దశాబ్దాలుగా నడుస్తున్న కేసుకు ముగింపు పలికింది. రూ.10 వేల కోట్ల విలువైన భూమి ప్రభుత్వ ఖాతాలో చేరింది. ఇన్నాండ్లుగా ఎందరో బడాబాబులు కన్నేసినా, అనేక మలుపులు తిరిగినా.. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమిగానే ఉన్నది. అనేక ఉత్తర్వులు, పాసు పుస్తకాల జారీ, తిరిగి రద్దు చేయడం.. ఇంకెన్నెన్నో రకాల వివాదాల నడుమ హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంపై ఎప్పుడూ అందరి నోళ్లల్లో నానుతూనే ఉంటుంది. రెండేళ్ల క్రితం ఈ ల్యాండ్ పై హెచ్ ఆర్సీ జోక్యం చేసుకొని ప్రైవేటు పార్టీకి అనుకూలంగా తీర్పునివ్వడం పట్ల అనేక అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత హైకోర్టు జోక్యం చేసుకొని ఆ ఉత్తర్వులను రద్దు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని నెలల తర్వాత హైకోర్టు ప్రైవేటు పార్టీకి అనుకూలంగా తీర్పునివ్వడంతో రెవెన్యూ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనేక వాదోపవాదాల తర్వాత అది ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని లెక్క తేల్చేసింది. ఈ మేరకు ఆదేశాలు తాజాగా జారీ అయ్యాయని రెవెన్యూ అధికారులు ‘దిశ’కు వివరించారు. అటు దుర్గం చెరువు. ఇటు జూబ్లీహిల్స్, మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు ఉండే కాలనీల పక్కనే. ఇంకో హైరైజ్డ్ బిల్డింగుల నడుమ 84.30 ఎకరాల ఖాళీ జాగ ఉండడంతో అందరి దృష్టి అటువైపే. ఎకరం ధర బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు తక్కువేం పలకదు. అందుకే రూ.10 వేల కోట్ల విలువైన ఖాళీ స్థలాన్ని దక్కించుకునేందుకు అనేక మంది, అనేక సంస్థలు కన్నేశారు. 50 ఏండ్ల నుంచి నడుస్తోన్న కేసులను పక్కన పెట్టి దొడ్డిదారిన హక్కులు దక్కించుకునేందుకు చేసిన ప్లాన్ కూడా బెడిసి కొట్టింది. మానవ హక్కుల కమిషన్ లో అనుకూలంగా తీర్పు పొందారు. ఈ తీర్పుతో అవాక్కయిన రెవెన్యూ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఫిబ్రవరిలో హెచ్ఆర్సీ ఇచ్చిన తీర్పును హైకోర్టు డిస్మిస్ చేసింది. మరికొన్ని నెలలకు మళ్లీ ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా రావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ భూమి ప్రభుత్వానిదిగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

చెంపపెట్టు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నం.46లోని 84.30 ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కులు పొందేందుకు కొందరు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కోర్టుల్లో కేసులు నడుస్తుండగానే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించి వారికి అనుకూలంగా పొందారు. ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదేనంటూ హెచ్ఆర్సీ తీర్పునిచ్చింది. నిజాం జారీ చేసినట్లుగా చెప్తున్న ఫర్మానా కరెక్టేనని, ఆ భూమిపై హక్కులు వారికే చెందుతాయంటూ పేర్కొన్నది. కానీ ఈ కేసుపై విచారణ గురించి, తీర్పు వెలువడే సమాచారం రెవెన్యూ అధికారులకు అందకుండా జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ అంశంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆ తర్వాత కూడా అనేక వాదనలు జరిగాయి. ఐతే ఈ ల్యాండ్ ని చేజిక్కించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టుకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులను బెదిరించారని సమాచారం. తాజాగా సుప్రీం కోర్టు హైకోర్టు అంతకు ముందు ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తున్నట్లు చెప్పడం పెద్దోళ్లకు చెంపపెట్టుగా మారింది. ప్రభుత్వ తరపున కౌన్సిల్ వైద్యనాధన్, వీవీ గిరి, ఏఓఆర్ పాల్వాయి వెంకట్ రెడ్డిలు వాదనలు వినిపించారు. అంతకు ముందు రాజేంద్రనగర్ ఆర్డీవోగా పని చేసిన కే చంద్రకళ, అప్పట్లో పని చేసిన శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీమోహన్ లు ఈ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయడానికి కృషి చేశారు.

పొరంబోకుగా నమోదై..

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాయిగా సర్వే నం.46లోని 84.30 ఎకరాలు ప్రభుత్వ రికార్డుల్లో పొరంబోకుగా నమోదైంది. 1952-53 నుంచి 1954-55 ల్లో ఖరీజ్ ఖాతాగా, పెంటయ్య, ఇతరులు అనుభవదారులుగా ఉంది. ఆ తర్వాత 1955-1958 నుంచి 1965-66 వరకు వలీఉల్లాహ్ హుస్సేన్ పట్టాదారుడిగా, పెంటయ్య, ఇతరులు అనుభవదారులుగా మార్చారు. మళ్లీ 1966-67 లో తిరిగి ఖరీజ్ ఖాతాగా మారింది. అనుభవదారుల పేరిట కూడా 1969-70లో కేవలం 8.13 ఎకరాలు మాత్రమే ఉంది. అనుభవారులపై ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కేసు కూడా నమోదైంది. వాళ్లు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దాంతో ప్రభుత్వం ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నది. ఆ తర్వాత సయ్యద్ వహీదుద్దీన్ హుస్సేనీ, తహశీల్దార్లకు వ్యతిరేకంగా ఓఎస్ నం.74/1978 ఫైల్ చేశారు. ఆనాటి నుంచి అనేక కేసులు, తీర్పులు వెలువడ్డాయి. అనేక మలుపులు తిరిగింది. ఇంకా కేసులు పెండింగులో ఉండగానే ఎం/ఎస్ లార్వెన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. షెడ్యూల్ ప్రాపర్టీని డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు పేర్కొంది. దీంతో మెరిట్స్, ఫ్యాక్ట్స్ ను పరిగణనలోకి తీసుకోకుండానే స్థలం ప్రైవేటుదంటూ ఆర్డర్ జారీ చేసింది. ఈ మేరకు వారికి స్థలాన్ని స్వాధీనం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ను ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం డబ్ల్యూపీ 28023/2021 ఫైల్ చేసింది. వాదనలను విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హెచ్ఆర్సీ ఆర్డర్స్(2704/2020)ని డిస్పోజ్ చేసింది. అంతకు ముందున్న కేసులపైనా సుప్రీం కోర్టు ద్విసభ్య న్యాయస్థానం సదరు ల్యాండ్ ప్రభుత్వానిదిగా తేల్చేసింది.


Similar News